Magazines

'సీతారామ' సత్తుపల్లి ట్రంక్‌ పనులను వేగవంతం చేయాలి

1 గంట క్రితం

Ministers
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 2 నిమిషాల చదవడం

- భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలి

- ​భూములు కోల్పోతున్న రైతులకు తక్షణమే పరిహారం అందించాలి

- నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మంత్రి తుమ్మల భేటీ

నవతెలంగాణ-సత్తుపల్లి 

​​ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీటి అవసరాలను తీర్చి, రైతుల భూములను సస్యశ్యామలం చేసే లక్ష్యంతో చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకం, సత్తుపల్లి ట్రంక్‌ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని  కోరారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో గురువారం భేటీ అయిన మంత్రి తుమ్మల ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్‌ పనులు, భూసేకరణ, పైప్‌లైన్‌ నిర్మాణం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. భూసేకరణను త్వరగా పూర్తి చేసి, భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారాన్ని వెంటనే అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. 

​సత్తుపల్లి, వేంసూరు మండలాలకు బిగ్ రిలీఫ్

సత్తుపల్లి ట్రంక్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరాన్ని తుమ్మల ప్రత్యేకంగా ప్రస్తావించారు. పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, బాధితులకు పరిహారం విడుదల చేయాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరారు. ఈ పనులు పూర్తయితే సత్తుపల్లి, వేంసూరు మండలాల పరిధిలో సాగు, తాగునీటి అవసరాలు శాశ్వతంగా తీరతాయని వివరించారు.​

ఆయకట్టు రైతులకు సాగునీటి భరోసా

వర్షాభావ పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయకట్టు రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో ఈ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి  తుమ్మల  ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వివరించారు. నీటి వనరులను సమర్థంగా వినియోగించుకునేలా పనులన్నీ త్వరగా పూర్తి చేయాలన్నారు. నాగార్జునసాగర్‌ ఆయకట్టు పరిధిలోని వైరా, లంకసాగర్‌ ప్రాంతాలకు సీతారామ ప్రాజెక్టు ద్వారా ఇటీవల నీటిని విడుదల చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుచేశారు. మంత్రి తుమ్మల విజ్ఞప్తులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పైప్‌లైన్‌, టన్నెల్‌ పనుల పురోగతిని సమీక్షించారు. రైతులకు త్వరగా సాగునీరు అందించేలా పెండింగ్‌ పనులను వేగవంతం చేయడం, భూసేకరణ సమస్యలను పరిష్కరించడంపై అధికారులకు తగిన ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేశారు. ​ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాలకు సాగు, తాగునీటి అవసరాలకు పూర్తి భరోసా లభించనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్