నవతెలంగాణ-ఆలేరు రూరల్
36వ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ఆలేరు మండలం పటేల్‌గూడెం గ్రామానికి చెందిన బొమ్మకంటి లక్ష్మీనారాయణను ఘనంగా సన్మానించారు. వయోవృద్ధులకు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ జిల్లా పరిషత్ సీఓ, సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఇన్‌చార్జి చిలుకూరి శ్రీనివాస్ శాలువా కప్పి, మెమొంటో అందజేసి సత్కరించారు. అనంతరం ఆయనకు అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్, డీఆర్‌డీఏ అధికారులు, ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. వయోవృద్ధులు తమను తాము వృద్ధులుగా భావించకుండా ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవించాలని అడిషనల్ కలెక్టర్ సూచించారు. సమాజంలో వయోవృద్ధుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.
జిల్లా పరిషత్ సీఓ చిలుకూరి శ్రీనివాస్ మాట్లాడుతూ వయోవృద్ధుల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే వయోవృద్ధుల కోసం ఒక గంట ఉచిత దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.వయోవృద్ధులంతా ఐక్యంగా ఉండాలని,ఎలాంటి సమస్యలు ఎదురైనా అధైర్యపడకుండా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ ప్రతి గురువారం వయోవృద్ధులకు ఉచిత వైద్య సేవలు, ఆరోగ్య పరీక్షలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వయస్సు పెరిగినా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
వయోవృద్ధుల సంక్షేమం, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సేవలందించినందుకు లక్ష్మీనారాయణకు అవార్డు లభించడంపై ఆలేరు మండల అధ్యక్షులు చింతకింది మల్లయ్య, ప్రధాన కార్యదర్శి పరిగెల రాములు, ఉపాధ్యక్షులు చిలుక రామ్ నరసయ్య,వల్లాల మధుసూదన్, జిల్లా కౌన్సిలర్ ఒగ్గు క్రిష్టఫర్, కొలనుపాక అధ్యక్షులు గాదె రాజిరెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు. మండలంలోని గోలనుకొండ,శారాజీపేట, టంగుటూరు,కొల్లూరు,పటేల్‌గూడెం, రాఘవపురం,మందనపల్లి,శ్రీనివాసపురం తదితర గ్రామాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు లక్ష్మీనారాయణకు శుభాకాంక్షలు తెలిపారు.





కామెంట్‌లు (0)