అరకేజీ వెండి ఆభరణాలు, రూ.1.50 లక్షల నగదు అపహరణ.. రూ.35 వేల విలువైన రోల్డ్ గోల్డ్ వస్తువులూ మాయం
నవతెలంగాణ–నాగోల్
జ్యువెలరీ షాపును లక్ష్యంగా చేసుకున్న దుండగులు పక్కనే ఉన్న దుకాణం గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించి భారీ చోరీకి పాల్పడ్డారు. షాపులో ఉన్న రూ.1.50 లక్షల నగదు, అరకేజీ వెండి ఆభరణాలు, సుమారు రూ.35 వేల విలువైన రోల్డ్ గోల్డ్ వస్తువులతో పాటు ఇతర విలువైన సామగ్రిని అపహరించి పరారయ్యారు. ఈ ఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ఆనంద్ నగర్ ఎక్స్ రోడ్డులో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనంద్ నగర్ ఎక్స్ రోడ్డులో ఉన్న ఆశాపుర పాన్ బ్రోకర్ అండ్ జ్యువెలర్స్ దుకాణాన్ని మహేందర్ సింగ్ గత తొమ్మిదేళ్లుగా నిర్వహిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి సమయంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు పక్కనే ఉన్న రావెండర్ బ్యూటీ పార్లర్కు ఆనుకుని ఉన్న గోడకు రంధ్రం చేసి జ్యువెలరీ షాపులోకి ప్రవేశించారు. అనంతరం దుకాణంలో ఉన్న నగదు, వెండి ఆభరణాలు, రోల్డ్ గోల్డ్ వస్తువులను మూటగట్టుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
చోరీ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే నాగోలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. షాపులోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ముగ్గురు వ్యక్తులు గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించిన దృశ్యాలు రికార్డయినట్లు గుర్తించారు.
సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఏసీపీ రవీందర్ రెడ్డి, నాగోలు ఇన్స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ, క్లూస్ టీమ్, సీసీఎస్ ఎల్బీనగర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. క్లూస్ టీమ్ నాలుగు వేలిముద్రలను సేకరించింది.
నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై నాగోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






కామెంట్లు (0)