Magazines

నాగోల్‌లో జ్యువెలరీ షాపులో చోరీకి యత్నం

16 నిమిషాల క్రితం

robbery
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 22, 2026 | 1 నిమిషాల చదవడం

వెనుక గోడకు కన్నం వేసి లోపలికి ప్రవేశించిన ముగ్గురు దుండగులు.. 

నాలుగు వేలిముద్రలు సేకరించిన క్లూస్ టీమ్

నవతెలంగాణ–నాగోల్
నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్‌నగర్ ఎక్స్‌రోడ్డులో జ్యువెలరీ దుకాణంలో చోరీకి జరిగిన యత్నం స్థానికంగా కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు పక్కా ప్రణాళికతో దుకాణం వెనుక గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించారు. అయితే వారి ప్రయత్నం ఫలించకపోవడంతో ఎలాంటి వస్తువులు అపహరణకు గురికాకుండా చోరీ యత్నం విఫలమైంది.


ఆనంద్‌నగర్ ఎక్స్‌రోడ్డులోని లావెండర్ బ్యూటీ పార్లర్ పక్కనే ఉన్న ఆశాపుర పాన్ బ్రోకర్ అండ్ జ్యువెలర్స్ దుకాణాన్ని మహేంద్ర సింగ్ గత తొమ్మిదేళ్లుగా నిర్వహిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి సమయంలో ముగ్గురు వ్యక్తులు దుకాణం వెనుక భాగానికి చేరుకుని గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించినట్లు తెలుస్తోంది. దుకాణంలో చోరీకి ప్రయత్నించినప్పటికీ ఎలాంటి బంగారు, వెండి ఆభరణాలు లేదా ఇతర వస్తువులను ఎత్తుకెళ్లలేకపోయారు. దీంతో ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు.


సమాచారం అందుకున్న ఎల్‌బీనగర్ ఏసీపీ బి. రవీంద్రారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. క్లూస్ టీమ్, సీసీఎస్ ఎల్‌బీనగర్ పోలీసులు సైతం ఘటనాస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలో క్లూస్ టీమ్ నాలుగు వేలిముద్రలను గుర్తించి సేకరించింది.


దుకాణంలోకి ప్రవేశించిన ముగ్గురు వ్యక్తులు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుల కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. రద్దీగా ఉండే ప్రధాన రహదారి సమీపంలోనే జ్యువెలరీ దుకాణంలో చోరీకి యత్నం జరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్