నవతెలంగాణ-మల్హర్ రావు
పరీక్ష రాసి రూమ్ కు నడిచి వస్తుండగా బైక్ ఢీకొని ఓ ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందిన ఘటన నర్సంపేట మండలం లక్నెపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట మండలంలోని ఓ ప్రయివేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న బాసిక రాజ్ కుమార్(20) పరీక్ష రాసి లక్నెపల్లిలో ఉన్న రూమ్ కు నడుచుకుంటూ వెళ్తున్నాడు.
ఈ క్రమంలో అదే కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు బైక్పై వస్తూ అదుపుతప్పి రాజ్ కుమార్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన రాజ్ కుమార్ తమ కళ్లముందే కన్నుమూయడంతో తోటి విద్యార్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. రాజ్ కుమార్ దుర్మరణంతో రుద్రారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.






కామెంట్లు (0)