- అక్రమ మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు ముందస్తు చర్యలు..
- రెండు రోజుల్లో 32 మందిపై బైండోవర్
నవతెలంగాణ – చండూరు : చండూరు మండల పరిధిలో గ్రామగ్రామాన విస్తరిస్తున్న బెల్ట్ షాపుల ద్వారా అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ చర్యలను ముమ్మరం చేసింది. అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తూ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించే వారిని ముందుగానే గుర్తించి, అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో పోలీసులు ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టారు. మండలంలోని పలు గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి మంగళ, బుధవారాల్లో మొత్తం 32 మందిపై బైండోవర్ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బుధవారం ఒక్కరోజే 17 మందిని చండూరు తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి బైండోవర్ చేయించారు. అక్రమ మద్యం విక్రయాల వల్ల గ్రామాల్లో తలెత్తే సమస్యలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా చండూరు ఎస్ఐ జె. శివకుమార్ మాట్లాడుతూ మండల పరిధిలో ఎక్కడైనా అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహించినా, అనుమతులు లేకుండా మద్యం విక్రయించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అక్రమ మద్యం విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని, నిబంధనలను ఉల్లంఘించే వారిని గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా అక్రమ మద్యం విక్రయాలను ప్రోత్సహించవద్దని, ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, అక్రమ మద్యం విక్రయాల నియంత్రణకు పోలీసులకు సహకరించాలని ఎస్ఐ కోరారు.






కామెంట్లు (0)