Magazines

పంచాయతీలతోనే కొనసాగుతున్న పాలన.. 

2 రోజుల క్రితం

Governance
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 07, 2026 | 3 నిమిషాల చదవడం

• అధికారులు, ప్రజాప్రతినిధుల సఖ్యత లేమి 

• ఎవరి ఆరోపణలు వారివే...

• విచారణలతోనే గడుస్తున్న కాలం

• గ్రామాలలో కుంటుపడుతున్న అభివృద్ధి 

నవతెలంగాణ - మర్రిగూడ 

మండలంలో 18 గ్రామపంచాయతీలు, 42 ఆవాస గ్రామాలు ఉన్నాయి. కాగా గత కొన్ని రోజులుగా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో పాలన గాడి తప్పుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పరస్పర సహకారం ఉండాల్సిన చోట విభేదాలు, సమన్వయ లోపం కనిపిస్తుండటంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో నెలకొన్న తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, డ్రైనేజీ, విద్య, వైద్యం వంటి సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఇరువర్గాల మధ్య సఖ్యత కొరవడటంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

గ్రామాలలో కుంటుపడుతున్న అభివృద్ధి

మండల స్థాయిలో సమగ్ర అభివృద్ధి జరగాలంటే వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలి. అదేవిధంగా ఉన్నత స్థాయి అధికారులకు, గ్రామస్థాయి అధికారులకు మధ్య కూడా సఖ్యత ఉండాలి. మండల స్థాయిలో సమీక్షలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చర్చలు నిరంతరం జరగాల్సిన అవసరం ఉంది. కానీ నిత్యం ఏదో ఒక సమస్యతో ఆశించినంత స్థాయిలో గ్రామాలలో అభివృద్ధి జరగడం లేదు అని, సర్పంచ్ లను అడిగితే  చేసిన పనులకే బిల్లులు రావటం లేదంటూ చెబుతుండడంతో గ్రామ అభివృద్ధి పై కొంత ఎఫెక్ట్ పడుతుందని మేధావి వర్గం చర్చించుకుంటుంది.

మండల అధికారులకు పై పలు ఆరోపణలు 

గ్రామంలోని సమస్యలపై మండల అధికారులు దృష్టికి తెస్తే అవి పరిష్కారం కావటం లేదని, రాజకీయ ప్రోద్బలంతో తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, గ్రామాలలో జరిగే కార్యక్రమాలపై కొన్ని సందర్భాలలో తమకు సమాచారం కూడా ఇవ్వటం లేదని కొన్ని గ్రామాల సర్పంచులు నవంబర్ 4 న జరిగిన జనరల్ బాడీ సమావేశంలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉన్నత అధికారుల ఒత్తిడితో తాము ఉద్యోగాలు చేయలేమని 16 గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో ఈ నెల 3 న ఒక వినతి పత్రం ఇవ్వడం, కుదాబక్షపల్లి పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్, ప్రజా పాలన, వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు, స్థానిక ఎన్నికల్లో నిధులను దుర్వినియోగం జరిగిందంటూ ఈ నెల 3 న డిపిఓ తరుణ్ చక్రవర్తి విచారణ చేపట్టడం మండలంలో ప్రస్తుతం చర్చనీయాఅంశంగా మారింది.

ప్రజా సమస్యలపై ఎవరిది బాధ్యత?

నిత్యం మండలంలో ఏదో ఒక గ్రామంలో, ఏదో ఒక అధికారిపై విచారణ పర్వం కొనసాగుతుంటే గ్రామాల అభివృద్ధి ఎలా కొనసాగుతుందని ప్రజా సమస్యలు తమరి బాధ్యత కాదా అని, నిత్యం వ్యవహారమంతా వీటి చుట్టే తిరుగుతుందని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు పలు ఆరోపణలపై క్షేత్రస్థాయిలో గ్రామాలలో సర్వే చేసి విచారణ చేపట్టి, అధికారులు ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయ సమావేశాలు నిర్వహించి, సమస్యను పరిష్కరించి, ఈ ఆరోపణలకు చరమగీతం పాడాలని కోరుతున్నారు.

సమన్వయ సమావేశాలు నిర్వహించాలి: డాక్టర్ మెగావత్ చందు నాయక్ (సామాజిక కార్యకర్త) 

మండల అధికారులు, ప్రజా ప్రతినిధుల మధ్య వస్తున్న ఆరోపణలపై ఉన్నత అధికారులు స్పందించి వారి మధ్య సమన్వయ సమావేశాలు నిర్వహించి సమస్యను పరిష్కరించి గ్రామాలలో అభివృద్ధి కుంటు పడకుండా చర్యలు చేపట్టాలి.

విచారణ పై వివరణ ఇవ్వడం కుదరదు : జి సి మున్నయ్య ఎంపీడీవో మర్రిగూడ 

ఇటీవల డిపిఓ చేపట్టిన విచారణ పై నేను వివరణ ఇవ్వటం నిబంధనలకు విరుద్ధం.అది పై స్థాయి అధికారుల పరిధిలో ఉంటుంది. నవంబర్ 3 న వినతి పత్రం సమర్పించిన గ్రామపంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం విధుల్లో చేరారు. ప్రభుత్వపరంగా వచ్చే గ్రామ అభివృద్ధి పనులపై ప్రజా ప్రతినిధులకు కు ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేయడం జరుగుతూనే ఉంది.

అధికారుల పనితీరు సరిగ్గా లేదు : వల్లంల సంతోష్ యాదవ్ (యరగండ్లపల్లి సర్పంచ్)

మండలంలో పలు శాఖల అధికారుల పనితీరు సరిగ్గా లేదు. గ్రామంలో జరిగే పనులపై కొన్ని సందర్భాల్లో సర్పంచ్ లకు సమాచారం ఇవ్వకుండా రాజకీయ నాయకుల ప్రోత్బలంతో తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పలుమార్లు చెప్పిన వారి ప్రవర్తనలో మార్పు లేదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్