- అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలి
- తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్కు వినతిపత్రం
నవతెలంగాణ-సత్తుపల్లి
రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా తక్షణమే కొనుగోలు చేయాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ కు వినతిపత్రం అందజేశారు. శుక్రవారం సత్తుపల్లి తహసిల్దార్ కార్యాలయానికి వచ్చిన సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ను రైతు సంఘం డివిజన్ కార్యదర్శి రావుల రాజబాబు, సీపీఐ ఎం పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో కలిసి సమస్యలను వివరించారు.
ధాన్యం కోతలు ప్రారంభమైనప్పటికీ కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో తెరవకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కోసిన ధాన్యాన్ని కల్లాలు, రహదారుల పక్కన ఆరబోయాల్సి వస్తోందని, ఎల్నినో ప్రభావంతో అకాల వర్షాలు కురిస్తే ధాన్యం తడిసి, మొలకెత్తి రంగు మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తడిసి రంగు మారిన ధాన్యాన్ని నిబంధనల పేరుతో తిరస్కరించకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే ప్రమాదం ఉందని, దీనివల్ల రైతులు కనీస మద్దతు ధరను కోల్పోతారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో అన్ని గ్రామాల్లో తక్షణమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి గోనె సంచులు, తూకం యంత్రాలు, తేమ కొలిచే పరికరాలు, హమాలీ సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించి, రైతులకు సకాలంలో నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం నాయకులు మోరంపూడి వెంకట్రావు, చావా రమేష్, చప్పిడి భాస్కర్, కువ్వారపు లక్ష్మణ్, సాధు శేఖర్ పాల్గొన్నారు.






కామెంట్లు (0)