కొలనుపాక ప్రభుత్వ భూమి కోసం సీపీఐ ధర్నా
రెండున్నరేళ్లుగా పోరాటం చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం..
హామీలు అమలు చేయకుంటే పెద్దఎత్తున ఆందోళనలు : సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్
నవతెలంగాణ ఆలేరు రూరల్
ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలోని సర్వే నంబర్ 8లో ఉన్న రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని అర్హులైన పేదలకు ఇంటి స్థలాలుగా కేటాయించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆధ్వర్యంలో గురువారం ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో పేదలకు ఇంటి స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించిందని విమర్శించారు. సొంత ఇల్లు, ఇంటి స్థలం లేక నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొలనుపాక గ్రామంలోని సర్వే నంబర్ 8లో ఉన్న రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలుగా పంపిణీ చేయాలని, గత రెండున్నర సంవత్సరాలుగా సీపీఐ అనేక పోరాటాలు నిర్వహిస్తోందని తెలిపారు. అయినప్పటికీ అధికారులు, ప్రభుత్వం స్పందించకపోవడం పేదల పట్ల నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.
పేదలకు న్యాయం జరిగే వరకు సీపీఐ పోరాటం ఆగదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇంటి స్థలాల సమస్యను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ ఆలేరు మండల కార్యదర్శి చౌడబోయిన కనకయ్య,గ్రామ శాఖ కార్యదర్శి పొన్నబోయిన రవి, మహిళా సమాఖ్య జిల్లా సహాయ కార్యదర్శి మాటూరి జానమ్మ, సీపీఐ మండల కార్యవర్గ సభ్యుడు కందుల మధు,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చౌడబోయిన పరశురాములు, ప్రజానాట్యమండలి జిల్లా ఉపాధ్యక్షుడు పోతు ప్రవీణ్,వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు నల్ల అండాలు,భూ పోరాట కమిటీ సభ్యులు మోతె భవాని,యాదమ్మ, శ్రీలత,సుశీల తదితరులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)