ఎంపీ కార్యక్రమానికి హాజరైతే సస్పెండ్ చేస్తారా.?
కొయ్యూర్ ఉపసర్పంచ్ లకావత్ సవేందర్ ఆవేదన
నవతెలంగాణ - మల్హర్ రావు
కాంగ్రెస్ పార్టీ కోసం గత 20 ఏళ్లుగా జెండా మోస్తూ, పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేసిన తమను, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని మండలంలోని కొయ్యూర్ ఉపసర్పంచ్ లకావత్ సవేందర్ ప్రశ్నించారు. గురువారం కొయ్యుర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయనతో పాటు పలువురు కార్యకర్తలను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇటీవల కొయ్యూర్ గ్రామంలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేసిన నేపథ్యంలో కార్యక్రమానికి హాజరైనందుకే తమపై సస్పెన్షన్ వేటు వేశారని బాధితులు ఆరోపించారు.
తనతోపాటు వార్డు సభ్యురాలు లకావత్ లక్ష్మీ, తిరుపతి, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఖలీంపై పార్టీ సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లుగా మండల పార్టీ అధ్యక్షుడు ప్రకటించడం సరికాదన్నారు.
ఎంపీ కార్యక్రమానికి హాజరైతే పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లేనా.. ప్రజాప్రతినిధిగా ఉన్న ఎంపీ పాల్గొన్న కార్యక్రమానికి హాజరు కావడంలో తప్పేముందని ప్రశ్నించారు. గతంలో పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేసిన తమకు, ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై తీసుకున్న నిర్ణయం అన్యాయమన్నారు. అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న తమకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సస్పెన్షన్ చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. తమను సస్పెండ్ చేసే అధికారం ఎవరూ ఇచ్చారని, ఏ కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారో పార్టీ నాయకత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీకి చెందిన ఎంపీ కార్యక్రమానికి హాజరుకావడం తప్పాని తమపై తీసుకున్న సస్పెన్షన్ నిర్ణయంపై తాము అధిష్టానాన్ని కలిసి వివరాలు తెలియజేస్తామని వెల్లడించారు.







కామెంట్లు (0)