- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు జాజిరి శ్రీనివాస్
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు లేని పేదలకు వెంటనే ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి, ఆ ఇచ్చిన స్థలాల్లో ఇందిరమ్మ పథకం ద్వారా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యుడు జాజిరి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం సత్తుపల్లి మండలం గంగారంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో అపార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో నివాస స్థలాలు లేక వేలాది మంది నిరుపేదలు తీవ్ర అవస్థలు పడుతున్నారని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధానంగా గంగారం, పాకలగూడెం, తుంబూరు, సిద్దారం, కాకర్లపల్లి, కిష్టాపురం గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములను తక్షణమే గుర్తించి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సత్తుపల్లి మండలంలో దాదాపు 3 వేల కుటుంబాలకు సొంత ఇళ్ల స్థలాలు లేవని, ఇందిరమ్మ ఇళ్లు రాక వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇటీవల గంగారం సభలో ఆ గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త దాసరి ఉదయ్ కుమార్ రెడ్డి వారి తాన్ల సొల్యూషన్స్ కంపెనీ నుంచి రూ. 300 కోట్లు ఇస్తానని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ప్రకటించిన నేపథ్యంలో ఆ నిధులతో పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ చేసి రాత ప్రకటించిన డబ్బుతో ఇళ్లు కట్టించి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ కోరారు. పార్టీ మండల కార్యదర్శి జాజిరి జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మండల కమిటీ సభ్యులు కువ్వారపు లక్ష్మణరావు, కావూరి వెంకటేశ్వరరావు, దేవళ్ల రామారావు, గుంటూరు జయరాజు, హసావత్ కృష్ణ, కంచి నాగేశ్వరరావు పాల్గొన్నారు.







కామెంట్లు (0)