Magazines

వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి మార్గదర్శకాలు

1 గంట క్రితం

Guidelines
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 25, 2026 | 2 నిమిషాల చదవడం

- 2026 - 27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపులు

- కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు రాయితీ

- రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, పీఏసీఎస్‌, మహిళా సంఘాలకు అవకాశం

- ఆత్మ ( బీఎఫ్ఏసీ) - వ్యవసాయ అనుబంధ రంగాలు అధికారులతో సమావేశం 

 - ముఖ్య అతిథిగా హాజరు కానున్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ 

నవతెలంగాణ – అశ్వారావుపేట

వ్యవసాయ పనుల్లో యాంత్రీకరణను ప్రోత్సహించి, రైతులకు ఆధునిక యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి సంబంధించి 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపులు, మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ఈ పథకం ద్వారా కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన వ్యవసాయ యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచనున్నారు.


ఈ నేపథ్యంలో సోమవారం నియోజకవర్గం లోని దమ్మపేట మండలం మల్లారం రైతు వేదికలో ఆత్మ (బీఎఫ్ఏసీ) చైర్మన్ సుంకవల్లి వీరభద్ర రావు అధ్యక్షతన వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.ఈ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు సుంకవల్లి వీరభద్ర రావు ఆదివారం తెలిపారు.

పథకానికి అర్హులెవరు?:

వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు కింది సంస్థలకు అవకాశం కల్పించనున్నారు.

- రిజిస్టర్డ్ రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్‌).

- ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌).

- మహిళా స్వయం సహాయక సంఘాలు.

పైన పేర్కొన్న సంస్థలు నిర్దేశిత అర్హతలను కలిగి ఉండాలి. బ్యాంకు రుణ సదుపాయాలు, సంబంధిత పత్రాలు తదితర అంశాల ఆధారంగా పథకం అమలుకు చర్యలు తీసుకోనున్నారు.

ఎంత సబ్సిడీ లభిస్తుంది?:

కస్టమ్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు యూనిట్ వ్యయంలో గరిష్ఠంగా రూ.20 లక్షలు లేదా 40 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని రాయితీగా అందించనున్నారు.

డ్రోన్ తో కూడిన కస్టమ్ హైరింగ్ సెంటర్ ఏర్పాటుకు గరిష్ఠంగా రూ.5 లక్షలు లేదా 50 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని రాయితీగా అందిస్తారు.

ఆన్‌లైన్ విధానంలో అమలు:

వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అమలు చేయనున్నారు. ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా లబ్ధిదారుల దరఖాస్తులు, సంబంధిత ప్రక్రియలను నిర్వహించి, నిబంధనల ప్రకారం వ్యవసాయ యంత్ర పరికరాలను అందజేసే విధంగా చర్యలు చేపట్టనున్నారు.జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆధ్వర్యంలో మరియు మండల స్థాయిలో కమిటీ ఈ దరఖాస్తుల అర్హత ను గుర్తించి యంత్రపరికారాలను మంజూరు చేస్తారు.

ఈ పధకం అమలు అయితే రైతు కు వ్యక్తిగతంగా రాయితీ వ్యవసాయ యంత్ర పరికరాలు అందే అవకాశాలు "చేజారే" అవకాశాలు ఉన్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్