నవతెలంగాణ-మల్హర్ రావు
ఎల్ నినో ప్రభావంతో మండలంలో పొలాలు చేతికొచ్చే చివరిదశలో సాగునీరు అందక ఎండుతున్నాయి. దీంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మండలంలోని ఎడ్లపల్లి, రుద్రారం అటవీ ప్రాంతంలో ఉన్న చిన్న నీటిపారుదల ప్రాజెక్టు బొగ్గుల వాగు ప్రాజెక్ట్ ఈ ప్రాంత రైతులకు జీవనాధారం. ఈ ప్రాజెక్టు కింద గతంలో 6 వేల ఎకరాల్లో సాగు అయ్యేది.కానీ ఇప్పుడు 5 వేల నుంచి పైచిలుకు ఎకరాలకు సాగునీరు అందించే బొగ్గుల వాగు ప్రాజెక్టు ఈ సంవత్సరం వర్షాలు లేక ప్రాజెక్టు నిండలేదు.దీంతో అన్నదాతలకు సాగునీరుకు కష్టాలు తప్పడం లేదు. వర్షాలు కురుస్తాయని చెరువులు నిండుతాయని ఆశపడి రైతులు కంటి చూపు మేర వరకు వరి పంటలు సాగు చేశారు. ఈ వర్షాకాలం వర్గాలు అరకొరగా కురిసిన వర్షంతో నిండిన చెరువులు, కుంటలు ఎండల వేడికి నేల పీల్చుకోవడం, ఆవిరి కావడం వల్ల చెరువులు ప్రాజెక్టులు నీళ్ల మట్ట తగ్గుముఖం పట్టడంతో సాగునీరుకు కష్టతరంగా మారింది.
వల్లెంకుంట, ఎడ్లపల్లి మార్గమధ్యం కొయ్యూరు పరిసర ప్రాంతం వరి పొలాలు ఎండిపోయాయి. బొగ్గుల వాగు ప్రాజెక్టు కాలువ నీరు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతుల ఆవేదన చెందుతున్నారు. బొగ్గుల వాగు ప్రాజెక్ట్ నుండి వచ్చే కాలువలు ఎక్కడికక్కడ తుంగ, నాచుతో నిండిపోయి అక్కడక్కడ గండ్లు పడి సాగునీరు చివరి వరకు పారడం కష్టంగా మారింది. దీంతో చివరి ఆయకట్టు రైతులకు కష్టతరం అవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వల్లెం కుంట గ్రామానికి చెందిన రైతులు గడిపెల్లి సమ్మరాజు, కొండ్ర సత్తయ్య, గడం రమేష్, బోడ రామచంద్రం, పసుల పోచయ్య, గడ్డం రాజయ్య లతోపాటు మరి కొంత మంది రైతులకు చెందిన ఒక్కొక్కరికి రెండెకరాల వ్యవసాయ వరి పంటలు బొగ్గుల ప్రాజెక్టు సాగునీరు ఆశతో వారి పంటలు వేశారు.
ఎల్ నినో ప్రభావం వరి పంటల పై పడింది. భూగర్భజలాలు అడుగంటి పోతుండడంతో బోర్ బావులు సైతం చిన్నదారలతో నీరు బయటికి పోస్తూ ఉండడం రైతులను అరెకరం, ఎకరం, కలవర పెడుతోంది. చేతికందే ముందే ఎండిపోయి పొలాల్లో బీటలు వారింది దీంతో ఏం చేయలేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇరిగేషన్ శాఖ ఏఈని రైతులు సాగునీరు విషయంపై అడుగగా రైతులే సొంత ఖర్చులతో కాలువలను రిపేర్ చేసుకొని సాగునీరు తీసుకెళ్లండి అంటూ సమాధానం ఇచ్చారని రైతులు వాపోతున్నారు. ఇదేంటి ఇలా సమాధానం చెబుతున్నారని రైతులు ప్రశ్నించగా మేమేం చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.






కామెంట్లు (0)