Magazines

మక్తల్–నారాయణపేట రోడ్డుకు మోక్షం ఎప్పుడు.?

4 గంటల క్రితం

brs
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 2 నిమిషాల చదవడం

రూ.237 కోట్లు ఎక్కడ పాయె.. శంకుస్థాపనలతోనే సరిపెడతారా?

కలెక్టరేట్ వరకు మాజీ ఎమ్మెల్యే చిట్టెం పాదయాత్ర

నాలుగు లైన్ల రహదారి పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్

నవతెలంగాణ–మక్తల్

మక్తల్–నారాయణపేట నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి పలుమార్లు శంకుస్థాపనలు చేసినా పనులు మాత్రం ప్రారంభం కాకపోవడంపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి నిర్మాణానికి కేటాయించిన రూ.237 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. రహదారి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ శనివారం మక్తల్ నుంచి నారాయణపేట జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు.


మక్తల్ పట్టణంలోని నారాయణపేట చౌరస్తా వద్ద ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పాదయాత్రలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్ర అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు నాయకులు తెలిపారు.


శంకుస్థాపనలు ఎన్నిసార్లు.. పనులు ఎప్పుడు?

మక్తల్–నారాయణపేట నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి స్థాయిలో శంకుస్థాపన చేసినా ఆరు నెలలకే మరోసారి రోడ్లు–భవనాల శాఖ మంత్రుల చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగిందని చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడం దురదృష్టకరమన్నారు.


జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా, అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లాలన్నా ప్రజలు ఈ రహదారిపైనే ఆధారపడాల్సి వస్తోందన్నారు. ప్రస్తుతం రహదారి గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో రోగులను నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించేందుకు ఇదే ప్రధాన మార్గమని, రహదారి అధ్వానంగా ఉండటంతో ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.


కొడంగల్‌కు అభివృద్ధి.. మక్తల్‌పై ఎందుకు నిర్లక్ష్యం?

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో సింగిల్‌ రోడ్లను డబుల్‌ రోడ్లుగా, డబుల్‌ రోడ్లను నాలుగు లైన్ల రహదారులుగా అభివృద్ధి చేస్తున్నారని చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మరి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రా? లేక కొడంగల్ నియోజకవర్గానికే ముఖ్యమంత్రా? అని ప్రశ్నించారు. పక్కనే ఉన్న నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల అభివృద్ధిపై ఎందుకు దృష్టి సారించడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


శంకుస్థాపనలకు మాత్రమే పరిమితం కాకుండా, రూ.237 కోట్లతో చేపట్టాల్సిన నాలుగు లైన్ల రహదారి నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించి ప్రజల కష్టాలను తీర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. పాదయాత్రలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్‌గుప్తా, మాజీ మార్కెట్ చైర్మన్ నరసింహగౌడ్, టౌన్ అధ్యక్షుడు చిన్న హనుమంతు, జుబేర్‌పాషా, సర్పంచులు గాల్‌రెడ్డి, రవితేజ, శ్రావణ్, మాగనూరు మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి, అన్వర్, హుస్సేన్, పారేవుల అసిరెడ్డి, వెంకటేష్, రుద్రసముద్రం రామలింగం, శివారెడ్డి, ఈశ్వర్‌యాదవ్, జుట్ల సాగర్, నరసింహారెడ్డి, బండారి ఆనంద్, బసంత్‌రెడ్డి, అశోక్‌గౌడ్, నరసింహులు, జుట్ల శంకర్, మొగులప్ప, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్