- కాపాడిన అశ్వారావుపేట వైద్యులు
- ఏరియా ఆసుపత్రిలో అత్యవసర శస్త్రచికిత్స
- గైనకాలజిస్టుల సమయస్ఫూర్తికి ప్రశంసలు
నవతెలంగాణ - అశ్వారావుపేట
ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భిణీ కి అత్యవసరంగా శస్త్రచికిత్స నిర్వహించి తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ వైద్యులు సమయస్ఫూర్తితో వ్యవహరించి విజయవంతంగా చికిత్స అందించడంతో ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలకు మరోసారి ప్రశంసలు లభిస్తున్నాయి. అశ్వారావుపేట మండలం గుంటిమడుగు గ్రామానికి చెందిన ఆశి సమ్మక్క ప్రసవం కోసం అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు అవసరమైన చికిత్స అందిస్తూ శస్త్రచికిత్స చేపట్టారు. ఈ క్రమంలో తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి అత్యంత విషమంగా మారింది. అప్పటికే ఆమె హిమోగ్లోబిన్ స్థాయి 8.1 గ్రాముల నుంచి 4.8 గ్రాములకు పడిపోవడంతో వైద్యులు అప్రమత్తమయ్యారు.
క్లిష్ట పరిస్థితుల్లో గర్భసంచి తొలగించాల్సిన అవసరం ఏర్పడినప్పటికీ, గైనకాలజిస్టులు డాక్టర్ రాధా రుక్మిణి, డాక్టర్ మౌనిక చాకచక్యంగా వ్యవహరించారు. అత్యవసర వైద్య చర్యలు చేపడుతూ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి పండంటి బిడ్డకు పురుడు పోశారు. అనంతరం అత్యవసరంగా ఏబీ పాజిటివ్ రక్తం ఒక యూనిట్* ఎక్కించి తల్లికి మెరుగైన వైద్యం అందించారు. దీంతో తల్లీబిడ్డలు ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధా రుక్మిణి మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో సమష్టిగా పనిచేసిన వైద్య, సిబ్బంది బృందం కృషితోనే తల్లీబిడ్డలను కాపాడగలిగామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్, డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు లు అందిస్తున్న సహకారం, ప్రోత్సాహంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
తమ కుటుంబ సభ్యురాలిని, నవజాత శిశువును క్షేమంగా కాపాడిన వైద్య బృందానికి రోగి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అత్యవసర వైద్య సేవల కార్యక్రమంలో మత్తు వైద్య నిపుణురాలు డాక్టర్ మౌనిక, చిన్నపిల్లల వైద్యురాలు డాక్టర్ స్రవంతి, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రాణాపాయ పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకుండా వైద్య నైపుణ్యం, సమయస్ఫూర్తితో తల్లీబిడ్డల ప్రాణాలను కాపాడిన అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రి వైద్య బృందం సేవలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ క్లిష్టమైన అత్యవసర వైద్య సేవలు సమర్థవంతంగా అందుతున్నాయనే నమ్మకాన్ని ఈ ఘటన మరోసారి చాటి చెప్పింది





కామెంట్లు (0)