-జిల్లా ప్రోగ్రాం అధికారి యనగందుల నాగరాజు
నవతెలంగాణ తుంగతుర్తి: కుష్టు వ్యాధి రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని,ఈ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించినట్లయితే పూర్తిగా నిర్మూలించవచ్చునని జిల్లా ప్రోగ్రాం అధికారి యనగందుల నాగరాజు అన్నారు.జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా నేటి నుండి నవంబర్ 4వరకు (14రోజులపాటు)కుష్టు వ్యాధి కేసుల గుర్తింపు ప్రచార కార్యక్రమాన్ని,సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు జిల్లా ప్రోగ్రాం అధికారి నాగరాజు తెలిపారు.
కార్యాచరణ ప్రణాళికలు
ముందస్తు అవగాహన:
గ్రామస్థాయిలో ప్రజలకు కుష్టు వ్యాధి లక్షణాలు,ఉచిత పరీక్షలు,చికిత్సపై అవగాహన కల్పించాలి.
ఇంటింటి సర్వే:
ఆశా కార్యకర్తలు,ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి అనుమానిత లక్షణాలు ఉన్నవారిని గుర్తించాలి.
పర్యవేక్షణ:
ఏఎన్ఎంలు,సూపర్వైజర్లు సర్వేను పర్యవేక్షించి,గుర్తించిన అనుమానితులను వైద్య పరీక్షలకు పంపించాలి.
నిర్ధారణ-చికిత్స:
వైద్యాధికారులు అనుమానిత కేసులకు అవసరమైన వైద్య పరీక్షలు,నిర్ధారణ,చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలి.
సమీక్ష-నివేదికలు:
సర్వే పురోగతిని సమీక్షిస్తూ,రోజువారి వివరాలను నిర్దేశిత విధానంలో సమర్పించాలి.
ప్రజలకు ప్రత్యేక సూచనలు:
చర్మంపై స్పర్శజ్ఞానం తగ్గినా,మచ్చలు,చేతులు కాళ్లల్లో తిమ్మిర్లు వంటి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.సర్వే కు వచ్చే ఆరోగ్య సిబ్బందికి సహకరించి,కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను తెలియజేయాలన్నారు.కుష్టు వ్యాధిపై అపోహలు,వివక్షకు తావివ్వకుండా,లక్షణాలు ఉన్న వారిని పరీక్షలు,చికిత్స కోసం ప్రోత్సహించాలని తెలిపారు.జిల్లాలోని అన్ని పిహెచ్సిలు,యూపీహెచ్సీల వైద్యాధికారులు,సూపర్వైజర్లు,ఏఎన్ఎంలు,ఆశా కార్యకర్తల,ఆరోగ్య సిబ్బంది సమన్వయంతో గ్రామస్థాయిలోని ప్రజలను చైతన్యపరిచి నేటి నుండి నవంబర్ 4వరకు జరిగే ఎల్సిడిసి ప్రచారాన్ని విజయవంతం చేయాలని జిల్లా ప్రోగ్రాం అధికారి యనగందుల నాగరాజు పిలుపునిచ్చారు.






కామెంట్‌లు (0)