Magazines

డ్రైనేజీ వ్యవస్థ అస్థవ్యస్థం.. పట్టించుకోని అధికారులు

1 గంట క్రితం

Drainage
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ - భీంగల్ 

మురుగు కాలువల పక్కన జనం ఇండ్లు కట్టుకున్నారా.? లేక జనావాసాల్లో డ్రైనేజీలు నిర్మించి వాటిని నిర్లక్ష్యంగా వదిలేశారా.? తెలియడం లేదు. భీంగల్ పట్టణంలోని మూడవ 3 వార్డులో మురుగు కాలువల్లోని చెత్త మాత్రం ముందుకు కదలనని మొరాయిస్తోంది. రూ. వేల కొద్ది ఇంటి పన్నులు చెల్లిస్తున్నా మున్సిపాటిటీ అధికారులు కనీస సౌకర్యాలు కల్పించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదేమిటని అడిగితే పారిశుధ్య విభాగాధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని పేర్కొన్నారు. పట్టణాల్లోని వేలాది ఇండ్ల నుంచి రోజూ విడుదల అవుతున్న లక్షలాది లీటర్ల వ్యర్థాలు, మురికి నీరు, భారీ స్థాయిలో చెత్త అటు తిరిగి, ఇటు తిరిగి చివరకు డ్రైనేజీల్లో ఇండ్ల మధ్యకే వచ్చి పేరుకుపోతున్నాయి.


డ్రైనేజీల నిర్వహణలోని బాధ్యతారాహిత్యం వల్ల వందల టన్నుల సిల్టు, చెత్త, వ్యర్థాలు పేరుకపోవడంతోపాటు వాటిని తొలగించడం సమస్యగా మారింది. ఇందులో ముఖ్యంగా అధికారులు అశ్రద్ధ బాగా కనిపిస్తోందని అంటున్నారు. యంత్రాలు అందుబాటులో ఉన్నా.. పనిచేయించే సమర్ధత అధికారుల్లో కనిపించడం లేదంటున్నారు. దీని వల్ల నగర ప్రజలు అవస్థపడుతున్నారు. ఇదిగాక ఇసుక, మట్టి, చెత్తా చెదారం రోడ్లపై పోగవుతోంది. రోడ్లు శుభ్రం చేసే కార్మికులు దీన్నంతా సైడు కుప్పలుగా చేసి, ట్రాక్టర్ లో వెయ్యక పోవడంతో కాలువల్లో నిండుతుంది. దీంతో మురుగు కాలువల్లో చెత్త, దుమ్ము పేరుకపోయి, ఫలితంగా డ్రైనేజీలు రోడ్లపైకి ఉప్పొంగుతున్నాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా తయారైంది. మురికి వల్ల, దుర్వాసన రోడ్ల మీద నడవాలంటే అదోరకంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణాలు డంపింగ్‌ కేంద్రాలుగా కనిపించే ప్రమాదం దగ్గర్లోనే ఉందని పేర్కొన్నారు. పైగా రోడ్ల మీద పారుతున్న డ్రైనేజీ నీటిలో దోమలు పెరిగిపోతున్నాయి. జనాలు రోగాలబారిన పడుతున్నారు. 

నిధులు ఏమవుతున్నాయి?

ఏటా స్థానిక సంస్థల బడ్జెట్‌లో డీసిల్టేషన్‌, దోమలు నియంత్రణ, కోతుల బెడద నివారణకు నిధులు కేటాయిస్తుంటారు. పూడికతీతలకు కావాల్సిన సామగ్రి కొనడం, టెండర్ల నిర్వహణ వంటి వాటికి ఇందులోంచే అధికారులు ఖర్చు చేస్తుంటారు. ఏటా వేసవికి ముందు మేజర్‌ డ్రైనేజీల శుభ్రతకు సంబంధిత శాఖలోని విభాగమే ఈ చర్యలు తీసుకుంటుంది. కార్మికులతో చెత్త సేకరణ, మైనర్‌ సైడు కాలువల్లో పూడికతీత, వ్యర్థాల తొలగింపు పనులను మాత్రం పారిశుధ్య విభాగమే చూసుకోవాలి. అయితే ఈ పనులు ఎప్పటికప్పుడు సజావుగా జరగడం లేదనే ఫిర్యాదులు ఎప్పటికప్పుడు వస్తున్నాయి. ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని సమస్యలు పరిష్కరించడంలో అధికారులు వెనుకబడ్డారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్