నవతెలంగాణ – మిడ్జిల్: కల్వకుర్తి ఆర్టీసీ డిపో నుంచి నడిచే బస్సులు సమయానికి రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మిడ్జిల్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో కొందరు అధిక ఛార్జీలు చెల్లించి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు కల్వకుర్తి డిపో నుంచి మిడ్జిల్‌కు రావాల్సిన బస్సు 7 గంటలు దాటినా చేరుకోలేదు. దీంతో ఉదయం 6:10 గంటల నుంచే బస్టాండ్‌కు చేరుకున్న విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర ప్రయాణికులు పడిగాపులు కాశారు. బస్సులు ఆలస్యంగా రావడంతో కళాశాలలకు, కార్యాలయాలకు సమయానికి చేరుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
బస్సుల ఆలస్యం కారణంగా చదువుకు ఆటంకం కలుగుతోందని విద్యార్థులు, విధులకు సకాలంలో చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నామని ఉద్యోగులు తెలిపారు. ఒకే సమయంలో రెండు మూడు బస్సులు వరుసగా వస్తున్నా, నిర్ణీత సమయానికి బస్సులు నడపకపోవడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. డిపో అధికారుల పర్యవేక్షణ లోపమే ఈ సమస్యకు కారణమని ప్రజా సంఘాల నాయకులు, ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి, మిడ్జిల్ నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్లే ఉదయం బస్సులను నిర్ణీత సమయానికి నడిపేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






కామెంట్‌లు (0)