Magazines

ముంచెత్తిన మురసు

51 నిమిషాల క్రితం

rain effect
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 2 నిమిషాల చదవడం

- వేల ఎకరాల పంటలకు ముప్పు!

- కోత దశలో వరి పై వాన దెబ్బ.. 

- పత్తి, మినుము కు నష్టం భయం

- వేల ఎకరాల్లో పంటల పరిస్థితిపై రైతుల్లో ఆందోళన

నవతెలంగాణ -  అశ్వారావుపేట : మురసు తుఫాన్ ప్రభావంతో అశ్వారావుపేట వ్యవసాయ డివిజన్‌లో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కోత దశకు చేరుకున్న వరి పంటతో పాటు పత్తి, మినుము తదితర పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. పొలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో వరి పంట నేలకొరిగింది.

ఈ వానాకాలంలో అశ్వారావుపేట వ్యవసాయ డివిజన్ పరిధిలో 37,567 ఎకరాల్లో వరి, 25,838 ఎకరాల్లో పత్తి, 2,017 ఎకరాల్లో మినుము, 230 ఎకరాల్లో పెసర, 2,851 ఎకరాల్లో వేరుశనగ, 1,692 ఎకరాల్లో మిరప పంటలను రైతులు సాగు చేశారు. ప్రస్తుతం పత్తి పంటలో తొలిసారి ఏరడం ప్రారంభమై కొనసాగుతోంది.

దమ్మపేట, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో వరి కోతలు కూడా ప్రారంభమయ్యాయి. దమ్మపేట మండలంలో సుమారు వెయ్యి ఎకరాల్లో, అన్నపురెడ్డిపల్లి మండలంలో సుమారు 1,500 ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయి. అయితే తుఫాన్ ప్రభావంతో గత ఐదు రోజులుగా కోత పనులు నిలిచిపోయాయి.

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు, వాగులు, ఇతర నీటి వనరులు నిండిపోయాయి. భూగర్భ జలమట్టం కూడా పెరిగింది. అయితే ఇదే వర్షం ప్రస్తుతం పొలాల్లో నిలిచి వానాకాలం పంటలకు ముప్పుగా మారింది.

ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం సుమారు 4 వేల ఎకరాల్లో వరి, 5 వేల ఎకరాల్లో పత్తి, వెయ్యి ఎకరాల్లో మినుము పంటలకు నష్టం జరిగే అవకాశం కనిపిస్తోంది. వరి పొలాల్లో నీరు నిల్వ ఉండటం, వరద ప్రవాహం కారణంగా పంటలు నేలకొరిగాయి. వర్షం పూర్తిగా తెరిపిస్తేనే నష్టాలపై స్పష్టమైన అంచనా వేయడం సాధ్యమవుతుందని తెలుస్తోంది.

పత్తి పంటలో దూది తడిసి రంగు మారే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మిరప తోటల్లో వరద నీరు నిల్వ ఉండటం వల్ల మొక్కలు దెబ్బతినే అవకాశం ఉంది. యాసంగి పంటగా ఇటీవల విత్తిన మొక్కజొన్న మొలకలు కూడా నీరు నిల్వ ఉండటంతో నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.

లోటు నుంచి సాధారణ వర్షపాతానికి..

అక్టోబర్ 31 నాటికి ఈ ప్రాంతంలో వర్షపాతం లోటు నమోదైనప్పటికీ, గత రెండు రోజుల భారీ వర్షాలతో పరిస్థితి మారింది. లోటు వర్షపాత స్థితి నుంచి సాధారణ వర్షపాత స్థితికి చేరింది. ఒకవైపు చెరువులు, వాగులు నిండిపోవడం, భూగర్భ జలమట్టం పెరగడం ఉపశమనం కలిగిస్తుండగా.. 

మరోవైపు కోత దశలో ఉన్న పంటలను వర్షాలు ముంచెత్తడం రైతన్నను కలవరపెడుతోంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్