ధాన్యం కొనుగోలులో వ్యాపారుల మాయాజాలం
క్వింటాలు రూ.2,600 నుంచి రూ.2800 లోపే చెల్లింపు
అగమ్యగోచరంగా రైతుల పరిస్థితి
నవతెలంగాణ-మల్హర్ రావు
మండల వ్యాప్తంగా ప్రయివేటు వ్యాపారుల ధాన్యం కొనుగోలు దండ మూడు పువ్వులు,ఆరు కాయలుగా వర్ధిల్లుతొంది.మార్కెట్లో సన్నదాన్యం ధర ఒక్కసారిగా ఆకాశాన్ని అందడంతో మొదట్లో పచ్చి సన్నదాన్యం ధర క్వింటాలు రూ.3,250 నుంచి రూ.3,400 వరకు పెట్టిన వ్యాపారులు ప్రస్తుతం ఆ రేటును రూ.2800 కొనుగోలు చేస్తున్నారు.తాలు ఉందంటూ తరుగు పేరిట క్వింటాలుకు 8 కిలోలు అదనంగా తూకం వేయడం జరుగుతుందని రైతులు వాపోతున్నారు.కోతల సమయంలోనే వ్యాపారులు సిండుకేటుగా ఏర్పడి వరి మార్పిడి అయ్యేలోపు ధరలు తగ్గిస్తూ రైతులను దోచుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
అగమ్యగోచరంగా రైతులు..
మండలంలో వరి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.మొదట ఆశలు రేకెత్తించిన వర్షాలు వరి పంట గొలుసు దశలో ముఖం చాటేశాయి.దీంతో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. రైతులు పెట్టుకున్న ఆశలు అడుగంటాయి. వానాకాలంలో సన్నధాన్యం పండిస్తే మంచి ధర లభిస్తుందని పక్కనే ఉన్న పెద్దపల్లి జిల్లా రైతులు చెప్పడంతో మండల రైతులు కూడా సంతోషించారు.సన్నధాన్యమే పండించారు.మంచి ధర లభిస్తే కాస్త లాభ దాయకంగా ఉంటుందని ఆశపడ్డారు.కానీ దళారులు రైతుల వద్దకు వచ్చి ధాన్యం పరిశీలించి నాణ్యత లేదంటూ ధర తగ్గిస్తున్నారు.
క్వింటాల్ కు రూ.2,600 నుంచి రూ.2,7ల్800 లోపు నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు.అరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవాలంటే మండలంలో ఎక్కడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు.వర్షాభావ పరిస్థితులతో ఆశించిన దిగుబడి రాకపోయినా,చేతికొచ్చన పంటను అమ్ముకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి నెలకొంది.కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.దిగుబడి పడిపోయినా వచ్చిన పంటను అమ్ముకోవడం కూడా ఇబ్బందిగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.







కామెంట్లు (0)