నిత్యం అన్నదానం,చీరల పంపిణీ కార్యక్రమాలు
నవతెలంగాణ - మల్హర్ రావు
దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రమైన తాడిచర్ల ఓసిపి బ్లాక్-1 ఆవరణంలో ప్రతిష్టాపించిన దుర్గామాత అమ్మవారికి అత్యంత వైభవంగా పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని ఏఎమ్మార్ కంపెనీ సిఎండి మహేష్ రెడ్డి - రాధికారెడ్డి దంపతులు నిత్యం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, హోమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.
మైన్ కార్మికులు, ఉద్యోగులు, చుట్టుపక్కల ప్రజలందరిపై అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల పూజా కార్యక్రమంలో భాగంగా ఆదివారం నాగులమ్మ దేవాలయంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు, కార్మికులకు ప్రసాద వితరణ చేయడంతో పాటు, స్థానిక మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ చేపట్టారు.
ఈ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఏఎమ్మార్ కంపెనీ ప్రాజెక్ట్ హెడ్ ప్రభాకర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కెఎస్ఎన్ మూర్తి, మైన్ మేనేజర్ జి. శ్రీనివాస్, సేఫ్టీ ఆఫీసర్ కె. సురేష్ బాబు, జిఎం మెకానికల్ విశ్వ ప్రసాద్, కార్మికులు, స్థానిక గ్రామాల భక్తులు, మహిళలు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)