కుప్పకూలిన టెస్లా షేర్లు
వాషింగ్టన్ : టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య స్నేహ బంధం చెదిరింది. ట్రంప్ పేరు జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసు ఫైల్స్‌లో ఉందని మస్క్ ఆరోపించడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లింది. తనతో ఉన్న సంబంధాల కారణంగానే ట్రంప్ ఎన్నికల్లో గెలిచారని, కాంగ్రెస్‌లో రిపబ్లికన్‌లకు ఆధిక్యం లభించిందని మస్క్ ట్వీట్ చేశారు. మస్క్ తీరుపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగానే ఎలన్ మస్క్ కలత చెందారని ట్రంప్ పేర్కొన్నారు. మస్క్‌కు ప్రభుత్వం నుంచి అందుతున్న సబ్సిడీలను, కాంట్రాక్టులను కూడా రద్దు చేయాలని ప్రతిపాదించారు.
జెఫ్రీ ఎప్‌స్టీన్ 2019లో బాలికలను లైంగికంగా వేధించిన కేసులో అరెస్ట్ అయ్యాడు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ సహా పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ఎప్‌స్టీన్ ప్రయివేటు ద్వీపానికి తాను ఎప్పుడూ వెళ్లలేదని.. 2004లోనే అతనితో సంబంధాలు తెంచుకున్నానని ట్రంప్ పేర్కొన్నారు. ఇరువురి మధ్య మాటల యుద్ధంతో ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా షేర్లు కుప్పకూలాయి. గురువారం ట్రేడింగ్‌లో టెస్లా షేర్లు ఏకంగా 14శాతం లేదా 152 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.13 లక్షల కోట్లు) సంపద ఆవిరైంది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 1 ట్రిలియన్ మార్క్‌ను కోల్పోయి 916 బిలియన్ డాలర్లకు పడిపోయింది. టెస్లా సంపద ఒక్క రోజులోనే ఈ స్థాయిలో తరిగిపోవడం సంస్థ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం.
చెదిరిన మస్క్- ట్రంప్ స్నేహం
- Advertisement -
- Advertisement -