కలవరం

కలవరంసోమవారంతో ముగిసిన నాలుగో విడత పోలింగ్‌తో దక్షిణాది ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. దేశంలోని పదిరాష్ట్రాల్లో 96 లోక్‌సభ స్థానాలకు ఈ నాలుగోదశలో జరిగిన పోలింగ్‌లో దాదాపు సగం సీట్లు తెలుగురాష్ట్రాల్లోనే ఉన్నాయి. సీట్ల సంఖ్యరీత్యా మొత్తం ఏడు విడతలుగా జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ దశ రెండవ అతిపెద్దది. కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వ బలాబలాలను నిర్ణయించగలిగే యూపీ, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర వంటి కీలక రాష్ట్రాల్లోని కొన్ని స్థానాలకు కూడా ఈ దశలోనే ఎన్నికలు జరిగాయి.
ఈ దశతో ‘సౌత్‌మే సాఫ్‌’, ‘నార్త్‌, వెస్ట్‌ ఔర్‌ ఈస్ట్‌ మే హాఫ్’ అంటూ మోడీ పతనం మరింత ఖాయమైందని కాంగ్రెస్‌ అంటోంది. నిజానికి ఇటీవల మోడీ ప్రసంగాల్లోనూ, విమర్శల్లోనూ వచ్చిన మార్పులో అదే కనబడుతోంది. పాకిస్థాన్‌ విషయంలో ఫరూక్‌ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యను అన్యాపదేశంగా గుర్తుచేస్తూ, ‘ఇండియా ‘కూటమి నాయకులను మోడీ నిన్నటికి నిన్న బీహార్‌ ఎన్నికల సభలో పిరికిపందలుగా అభివర్ణించారు. అంతటితో సరిపెట్టకుండా, పాకిస్థాన్‌-గాజులు ప్రస్తావనలతో మరో మెట్టు ఎక్కించారు.
ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉండవన్న భయాలు అటు కమలనాథులనూ, ఇటు కార్పొరేట్లనూ గజగజ వణికిస్తున్నాయి. ఫలితంగా మొదటి రెండు విడతల పోలింగ్‌ అనంతరం ప్రధానమంత్రి సైతం తన స్థాయిని మరచి ప్రతిపక్షాలకు అధికారమిస్తే మంగళసూత్రాలు గుంజుకుంటారనీ, సంపదను మైనార్టీలకు కట్టబెడతారంటూ ఊరూరా విద్వేష వ్యాఖ్యలు చేశారు. మూడోవిడత ముగిశాక తన అనుంగు మిత్రులైన అదానీ, అంబానీలు కాంగ్రెస్‌కు ట్రక్కులనిండా డబ్బు తీసుకెళ్లి ఇచ్చారని బహిరంగంగా విమర్శలు చేసే స్థాయికి వెళ్లారు. మూడో విడత పోలింగ్‌ జరిగిన రోజునే హర్యానాలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిచ్చిన ముగ్గురు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు తమ సపోర్ట్‌ ఉపసంహరించడంతో అది మైనారిటీలో పడింది. మొత్తమ్మీద మోడీ నాయకత్వాన సాగుతున్న కార్పొరేట్‌ మతతత్వ కూటమి పాలన తుది ఘడియలకు చేరుకుంటోందన్న సంకేతాలు అన్ని వైపుల నుండీ కనబడుతున్నాయి.
నల్లధనం లేకుండా చేస్తానని చెప్పిన ప్రధానే ఇప్పుడు అదానీ, అంబానీ కాంగ్రెస్‌కు నల్లడబ్బు ఇస్తున్నారని చెబుతున్నారంటే దేశంలో ఇంకా నల్లడబ్బు ఉందని ఆయనే ఒప్పుకున్నట్టు కదా! మరి అంత డబ్బు చేతులు మారుతుంటే ఈడీని వారిపైకి ఎందుకు పంపలేదో ప్రధానమంత్రే చెప్పాలి. యూపీ, బీహార్‌, ఢిల్లీ, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లో ఇండియా వేదిక పార్టీల మధ్య సర్దుబాట్లు కుదిరినందున బీజేపీ వ్యతిరేక ఓటు గరిష్టంగా పోల్‌ అవుతున్న నేపథ్యంలో ‘ఇండియా’ పార్టీల సీట్ల పెరుగుదల, బీజేపీ దిగజారుడును స్పష్టం చేస్తోంది. కేరళ, తమిళనాడుల్లో కమలం ఖాతా తెరవబోదనీ, కర్నాటక, మహారాష్ట్ర, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఆ పార్టీకి సీట్లు తగ్గుతాయని ఇప్పటికే తేలిపోయింది. ప్రస్తుతం దేశ ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఏ భావోద్వేగాలకూ అంతలా గురికాకుండా గత పదేండ్ల మోడీ పాలనలో పెరిగిన ధరలు, దిగజారిన ఉపాధి, తరిగిన కొనుగోలుశక్తి వంటి అంశాలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటున్నారని సిఎస్‌డిఎస్‌- లోక్‌నీతి వంటి సర్వేలు సూచించాయి కూడా!
సార్వత్రిక ఎన్నికల నాలుగోదశలో ఓటింగ్‌ మొత్తంగా 65శాతం నమోదైంది. బెంగాల్‌లో అత్యధిక పోలింగ్‌ జరిగితే, 370 అధికరణ రద్దు తరువాత తొలిసారిగా జమ్మూకాశ్మీర్‌లో, శ్రీనగర్‌ పార్లమెంటరీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో శ్రీనగర్‌ పట్టణంలో కేవలం 14.43 శాతం ఓట్లు మాత్రమే పోల్‌ అయ్యాయి. కాశ్మీర్‌లో మిగతా చోట్ల పోటీకీ నిలబెట్టడానికి అభ్యర్థులు కూడా అధికారపార్టీకి కరువయ్యారు. దాదాపు 18కోట్లమంది ఓటుచేసిన ఈ నాలుగో దశతో 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 379 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ పూర్తయింది.
ఇటీవల తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. బీఆర్‌ఎస్‌ కుదేలైంది. గత పక్షం రోజులుగా కేసీఆర్‌ ఎంత శ్రమపడ్డా పెద్దగా ఫలితం ఉండదన్నది పరిశీలకుల అంచనా. తృణమూల్‌ కాంగ్రెస్‌ ‘ఇండియా’ సంఘటనలో భాగస్వామి అయినప్పటికీ అక్కడ కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తూ పెట్టుకోలేదు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందు ఒడిశాలో అధికారంలో ఉన్న నవీన్‌పట్నాయక్‌ నాయకత్వంలోని బిజూ జనతాదళ్‌కు, బీజేపీకి మధ్య పొత్తు కుదురుతుందన్న అంచనాలు తారుమారయ్యాయి. పొత్తు కుదరనందుకు మోడీ ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌పై ఒంటికాలి మీద లేస్తున్నా, ఆయనను కించ పరిచే రీతిలో మాట్లాడుతున్నా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలపడుతుందన్న భయంతోనే బిజూ జనతాదళ్‌తో బీజేపీ పొత్తు పెట్టుకోలేదని పిస్తోంది. దేశమంతా బలహీన బడుతున్న మన్న భయం ఎంతలేకపోతే ఏపీలో చంద్రబాబుతో జతకట్టి, మరోవైపు జగన్‌తో సంబంధాలను కొనసాగిస్తారు. ఇది వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం. ఏదిఏమైనా కేంద్రంలో లౌకిక ప్రభు త్వం ఏర్పడనుందన్న ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Spread the love