ఓ కొత్త అందం మన కంట కనబడితే మనసంతా చెప్పలేనంత సందడితో చెలరేగిపోతుంది. గుండె నిండా నిశ్శబ్దం నిండిపోతుంది. అలాంటి అందాన్ని గురించి చెబుతూ బలవర్ధన్ ఒక పాట రాశాడు. 2024 లో ప్రేమ్ దర్శకత్వంలో వచ్చిన ‘రిథమ్ ఆఫ్ లవ్’ సినిమాలోని ఆ పాటనిపుడు చూద్దాం.
బలవర్ధన్ ప్రేమికుల కోసమే ఈ పాట రాశాడా అన్నంతంగా ఈ పాట ప్రేమికులకు బాగా కనెక్ట్ అయింది. అమ్మాయిని చూసి అబ్బాయికి కలిగే ఆనందం, అలజడి ఈ పాటలో స్పష్టంగా కనిపిస్తాయి.
అమ్మాయి అందంగా కవ్విస్తుందట. అది ఎలా కవ్విస్తుందంటే నవ్వుతోటి. లేదా నడకతోటి. చూపులతోటి అని మనం అర్థం చేసుకోవచ్చు. అలా కవ్విస్తుంటే ఏమీ చేయలేని పరిస్థితిలో అబ్బాయి ఉన్నాడు. కారణం.. ఆ అందానికి ముగ్ధుడైపోయాడు. నిశ్చేష్టుడైపోయాడు. ఆ అందం గుండెల్లో గలాట చేసి ఆశ్చర్యపోయేలా చేసింది. నిశ్శబ్దంగా మనసు మారిపోయింది. అప్పుడు మనసు మన మాట వినే పరిస్థితిలో లేదు. ఇక ఏం చేయాలి? వయసేమో తొందరపడి పరుగులు పెడుతుంది. ఇది ఇక్కడ అబ్బాయి పడే యాతన.. వింత యాతన. కొంటె యాతన.
వయసు ఒక్కో అడుగు నెమ్మదిగా వేయమని అడుగుతోంది. వయసు తొందరపడినపుడు అడుగు వేగంగా వేయాలి కదా. మరి నెమ్మదిగా ఎందుకు వేయమంటుందంటే.. ఆ అమ్మాయి వెనకన అబ్బాయి నడుస్తున్నాడు కాబట్టి. నెమ్మదిగా నడవడం వల్ల ఇంకా ఎక్కువ సేపు అమ్మాయి వెనకన నడిచే అవకాశం అబ్బాయికి దొరకవచ్చు. అదీ అసలు విషయం.. అమ్మాయి వెనకేపడుతూ ఉంటే అబ్బాయిలో తుంటరిగా కొత్త కొత్త ఆశలు మొదలయ్యాయి. ఆ ఆశలు.. తీయని ఆశలు. కమ్మని ఆశలు. వయసుకు మాత్రమే తెలిసిన ఆశలు. లేత వయసులో ఉన్న వాళ్ళ మనసులో మాత్రమే ఉండే ఆశలు.. అబ్బాయితో అమ్మాయి గుణమేమిటో అని, అమ్మాయికే అబ్బాయి వరస ఏమిటో? అని.. ఇలా ఒక్కో క్షణం ఒక్కో రకంగా ఆలోచించడం.. ఊహలతో విహరించడం.. ఇదే ఇదే లేత వయసుపడే తపన.. అబ్బాయికి అమ్మాయి గుణం గురించి తెలుసుకోవాలన్న తపనే ఎక్కువగా ఉంటుంది. అమ్మాయికేమో అబ్బాయి వరసేంటో తెలుసుకోవాలన్న తపన ఉంటుంది. ఇద్దరికి ఒక్కో తపన.. కాని ఇద్దరి తపనకి కారణం ప్రేమే. అది ఇక్కడ స్పష్టమవుతుంది.
అబ్బాయి ప్రతి నిమిషం అమ్మాయి గురించే ఆలోచిస్తున్నాడు. అమ్మాయిని తలచుకుని అలసిపోతున్నాడు. అయినా మనసు హడావిడి చేస్తోంది. ఆమెపై ఉన్న ప్రేమ వల్లనే ఈ మాయ.. వింత మాయ జరుగుతోంది. అతడు మనసుతో మాట్లాడుకుంటున్నాడు. ఆమె ఎదురుగా వున్నప్పుడు మౌనమే అంతా.. కారణం ఆమె ముందు మాట్లాడేంతగా ధైర్యం లేకపోవడం. మౌనాన్నే సమాధానంగా వదిలివేస్తాడు ఆమె ముందు. మాటలు లేవు.
ఆమె ముందు మాట్లాడడం, మాట్లాడలేకపోవడం.. ఇవన్నీ పక్కన పెడితే.. ఆమెనే తనలోన నిలుపుకున్నాడు. తీయని ప్రేమ హాయి సరిగమల్లో అతను మునిగి ఉన్నాడు. ఆ అమ్మాయి ప్రేమలో పరవశిస్తున్నాడు. ఆ అమ్మాయి అతన్ని కలవరపరిచింది. మనసును పరవశింపజేసింది. ఆ పరవశింపజేసిన ఆనందంలో ఉన్న అబ్బాయి ఈ పాట రూపంలో తన స్పందనను తెలియజేశాడు.
పాట:
అమ్మాయి అందంగా కవ్విస్తుంటే ఏం చేద్దాం/ గల్లాట చేసి గుండెల్లో అదేంటనేంత నిశ్శబ్దం/ ఒక్కో అడుగు నెమ్మదిగ వేయమంటు అడుగు/ వెనకే పడుతూ తుంటరిగ కొత్త ఆశలు మొదలు/ అబ్బాయితో అమ్మాయి గుణమేంటో/ అమ్మాయికే అబ్బాయి వరసేంటో/ ఒక్కో క్షణం ఒక్కో రకంగా ఈ ఆలోచనలో/ అనుక్షణం నిన్నే తలచి అలసినా/ ఎదే హడావిడై గొడవపడితే/ అంతో ఇంతో ఎంతో మాయచేసే ప్రేమ పరిచయమే/ మనసుతో మాటాడే వేళ ఎదురుగ మౌనమే బదులు/ కుదురుగ నిన్నే నాలోన నిలిపిన హాయి సరిగమలో..
– డా||తిరునగరి శరత్‌చంద్ర,
sharathchandra.poet@yahoo.com
సినీ గేయరచయిత, 6309873682