Friday, December 19, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంవైవిధ్యమే భారతీయ సంస్కృతి

వైవిధ్యమే భారతీయ సంస్కృతి

- Advertisement -

మస్కట్‌లో ‘భారత్‌- ఒమన్‌ బిజినెస్‌ ఫోరం’ సదస్సులో మోడీ ప్రసంగం
ప్రధానికి ఆర్డర్‌ ఆఫ్‌ ఒమన్‌ అవార్డు అందజేత


మస్కట్‌: ”భారతీయులు ఎక్కడికి వెళ్లినా వైవిధ్యాన్ని గౌరవిస్తారు. ఆ వైవిధ్యమే భారతీయ సంస్కృతికి బలమైన పునాది” అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 11 ఏండ్లలో భారత్‌ తన ఆర్థిక డీఎన్‌ఏను మార్చుకుందని తెలిపారు. ఈ మార్పు వల్లే ప్రపంచంలోని అత్యంత పోటీతత్వ మార్కెట్లలో ఒకటిగా భారత్‌ ఎదిగిందన్నారు. ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్యాన్ని పెంచేందుకు భారత్‌ కుదుర్చుకుంటున్న ‘సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాలు’ (సీఈపీఏ) భాగస్వామ్య దేశాల్లో కొత్త విశ్వాసాన్ని నింపాయని పేర్కొన్నారు. గురువారం ఒమన్‌ రాజధాని మస్కట్‌లో నిర్వహించిన ‘భారత్‌ – ఒమన్‌ బిజినెస్‌ ఫోరం’ సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించారు.

‘మార్కెట్‌ ఏకీకరణ – ఆర్థిక క్రమశిక్షణ ‘
‘ఈ సదస్సు భారత్‌-ఒమన్‌ భాగస్వామ్యానికి కొత్త దిశను, వేగాన్ని అందిస్తుందని విశ్వసిస్తున్నా. దివాలా – బ్యాంక్‌ రప్ట్సీ కోడ్‌(ఐబీసీ), జీఎస్‌టీ వంటి విప్లవాత్మక చొరవల ద్వారా భారత్‌ వికాసం దిశగా అడుగులు వేసింది. జీఎస్‌టీ వ్యవస్థ వల్ల యావత్‌ భారత్‌లోని మార్కెట్‌ ఏకీకరణ జరిగింది. అలాగే సంస్థలకు ఆర్థిక క్రమశిక్షణ పెరిగింది. దీనివల్ల వాటి వ్యాపార కార్యకలాపాల్లో పారదర్శకత మెరుగుపడింది. భారత మార్కెట్‌పై పెట్టుబడిదారులకు విశ్వాసం పెరిగింది’ అని మోడీ అన్నారు.

కీలక ఒప్పందాలివీ
వ్యూహాత్మక సహకారానికి సంబంధించిన సంయుక్త విజన్‌ డాక్యుమెంట్‌పై భారత్‌ – ఒమన్‌ సంతకాలు చేశాయి. వ్యవసాయరంగ ఆవిష్కరణలు, ఆహార పరిశ్రమల విభాగంలో పరస్పర సహకారానికి సంబంధించిన ఒప్పందాన్ని కూడా ఇరుదేశాలు కుదుర్చుకున్నాయి. సముద్ర మార్గ వారసత్వం, మ్యూజియంలు, శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు, నైపుణ్య వికాసం, వాణిజ్య సహకారం, వ్యవసాయ విభాగాల్లో ఒమన్‌కు చెందిన ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, భారత్‌కు చెందిన కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) నాలుగు అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకున్నాయి.

ఆర్డర్‌ ఆఫ్‌ ఒమన్‌ అవార్డు అందుకున్న ప్రధాని
ప్రధాని మోడీకి అత్యున్నత పురస్కారమైన ఆర్డర్‌ ఆఫ్‌ ఒమన్‌ను సుల్తాన్‌ హైతం బిన్‌ తారిక్‌ అల్‌-సయీద్‌ ప్రదానం చేశారు. మూడు దేశాల పర్యటనలో చివరి గమ్యస్థానమైన ఒమన్‌లో ప్రధాని రెండ్రోజుల పర్యటన సందర్భంగా ఈ అవార్డును అందజేశారు. ఇది మోడీకి విదేశీ దేశం నుంచి ప్రదానం చేసిన 29వ అత్యున్నత పౌర పురస్కారం కావటం విశేషం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -