Thursday, December 25, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుజర్నలిస్టుల విభజన సరికాదు

జర్నలిస్టుల విభజన సరికాదు

- Advertisement -

ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
252 జీవోను సవరించాలి
డెస్క్‌ జర్నలిస్టులకూ అక్రిడిటేషన్‌ కార్డులివ్వాలి: డీజేఎఫ్‌టీ డిమాండ్‌


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో వర్కింగ్‌ జర్నలిస్టుల విభజన సరైంది కాదనీ, ఆ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డెస్క్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (టీజేఎఫ్‌టీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. అక్రిడిటేషన్‌ కార్డుల జారీ కోసం ప్రభుత్వం జారీ చేసిన 252 జీవోను సవరించాలని కోరింది. డెస్క్‌ల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకూ అక్రిడిటేషన్‌ కార్డులనే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. డెస్కు జర్నలిస్టులకు బస్‌ పాసుల విషయమై సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులు స్పష్టతనివ్వాలని డిమాండ్‌ చేసింది. బుధవారం హైదరాబాద్‌లోని చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో వివిధ పత్రికలు, ఛానళ్లలో పనిచేస్తున్న డెస్క్‌ జర్నలిస్టుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డెస్క్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (డీజేఎఫ్‌టీ) ఆవిర్భవించింది. కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడంతోపాటు, డెస్క్‌ జర్నలిస్టుల సమస్యలపై పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మీడియాలో రిపోర్టర్‌, డెస్క్‌ జర్నలిస్టులిద్దరూ వర్కింగ్‌ జర్నలిస్టు కిందికే వస్తారని చెప్పారు. అలాంటిది వారిని విభజించడం సమంజసం కాదన్నారు.

ఒకరు ఎక్కువ, ఇంకొకరు తక్కువ అనే వివక్ష చూపించేలా అధికారులు వ్యవహరించటం ఏంటని ప్రశ్నించారు. డెస్క్‌ జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ కార్డులను ఇవ్వబోమనీ, మీడియా కార్డుల పేరిట కొత్తగా కార్డులు జారీ చేస్తామని చెప్పడం సరికాదని అన్నారు. డెస్క్‌ జర్నలిస్టులను రెండో తరగతి పౌరులుగా చూడ్డమేనని చెప్పారు. పోరాడి సాధించుకున్న అక్రిడిటేషన్‌ హక్కును గుంజుకోవడం ఏంటని వారు ప్రశ్నించారు. ప్రస్తుతం అందుతున్న సంక్షేమ పథకాలు, భవిష్యత్తులో ప్రభుత్వం ఇవ్వాలనుకుంటున్న ఇండ్ల స్థలాల కేటాయింపు విషయంలో స్క్రీనింగ్‌ చేసేందుకే ఈ విభజన అనే అనుమానం అందరిలో ఉందని పేర్కొన్నారు. అక్రిడిటేషన్‌ కార్డులు, మీడియా కార్డులకు ఒకే రకమైన సంక్షేమ పథకాలు ఉంటాయని అధికారులు చెప్తున్నప్పుడు రెండు కార్డుల విధానం ఎందుకని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌యూజే అధ్యక్ష, కార్యదర్శులు బి అరుణ్‌ కుమార్‌, బి జగదీశ్వర్‌, టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి రాజశేఖర్‌, రాష్ట్ర కార్యదర్శి గండ్ర నవీన్‌, డబ్ల్యూఐజే రాష్ట్ర కార్యదర్శి రావికంటి శ్రీనివాస్‌, పలువురు సీనియర్‌ రిపోర్టర్లు పాల్గొని మద్దుతు ప్రకటించారు.

డీజేఎఫ్‌టీ నూతన కమిటీ ఎన్నిక
డీజేఎఫ్‌టీ రాష్ట్ర నూతన కమిటీని సభ్యులు ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బాదిని ఉపేందర్‌, ప్రధాన కార్యదర్శిగా మస్తాన్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోశాధికారిగా నిస్సార్‌, ఉపాధ్యక్షుడిగా కేవీ రాజారామ్‌, జాయింట్‌ సెక్రెటరీగా పి విజయ ఎన్నికయ్యారు.

పలు తీర్మానాలకు ఆమోదం
-డెస్క్‌ జర్నలిస్టులకూ అక్రిడిటేషన్‌ కార్డులు ఇవ్వాలి.
-జర్నలిస్టు, డెస్ట్‌ జర్నలిస్టు అంటూ వేర్వేరుగా చూడటం సరికాదు.
-డెస్క్‌ జర్నలిస్టులను అవమానించేలా, వర్కింగ్‌ జర్నలిస్టులను వేరు చేసేలా ఉన్న జీవో నెంబర్‌ 252ను సవరించాలి.
-అక్రిడిటేషన్‌ కమిటీల్లో డెస్క్‌ జర్నలిస్టులకు ప్రాతినిధ్యం కల్పించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -