– ప్రపంచ చెస్ గద్దెపై తొలిసారి మన అమ్మాయి
– ఫిడె చెస్ ప్రపంచకప్ కిరీటం కైవసం
– టైటిల్ పోరులో కోనేరు హంపిపై గెలుపు
– 19 ఏండ్ల నాగ్‌పూర్ స్కూల్ గర్ల్.
చదరంగ ఎత్తులు వేయటంలో దిట్ట. అయినా, ఇప్పటివరకు ఒక్క జీఎం నార్మ్ కూడా సాధించలేదు. ఇంటర్నేషనల్ మాస్టర్‌గా, 15వ సీడ్‌తో ఫిడె ప్రపంచకప్ చెస్ సమరంలో అడుగుపెట్టింది. ప్రపంచ మహిళల చెస్ దిగ్గజాలు, మాజీ ప్రపంచ చాంపియన్లను సైతం మట్టికరిపించింది. ఫిడె ప్రపంచకప్ చెస్ చాంపియన్‌గా నిలిచింది. ఆమెనే మహారాష్ట్ర అమ్మాయి దివ్య దేశ్‌ముఖ్. టైటిల్ పోరులో తెలుగు తేజం కోనేరు హంపి టైబ్రేకర్‌లో తడబాటుకు లోనవగా.. దివ్య దేశ్‌ముఖ్ ఫిడె చెస్ ప్రపంచకప్ టైటిల్‌తో పాటు గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌ను సైతం సొంతం చేసుకుంది.
నవతెలంగాణ-బటుమి
దివ్య దేశ్‌ముఖ్.. ఫిడె 2025 మహిళల చెస్ ప్రపంచకప్ విజేతగా నిలిచింది. రెండు రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన టైటిల్ పోరులో సహచర భారత గ్రాండ్‌మాస్టర్, రెండు సార్లు ర్యాపిడ్ చెస్ ప్రపంచ చాంపియన్ కోనేరు హంపిపై దివ్య దేశ్‌ముఖ్ మెరుపు విజయం సాధించింది. సోమవారం జరిగిన టైబ్రేకర్‌లో తొలి గేమ్ డ్రాగా ముగిసినా.. రెండో గేమ్‌లో దివ్య దేశ్‌ముఖ్ గెలుపొందింది. 1.5-0.5తో కోనేరు హంపిపై సాధికారిక విజయం నమోదు చేసింది. గ్రాండ్‌మాస్టర్లు అలెగ్జాండ్ర (2021), అలెక్సాండ్ర (2023) తర్వాత ఫిడె మహిళల చెస్ ప్రపంచకప్ విజేతగా నిలిచిన మూడో అమ్మాయిగా నిలిచింది. తొలిసారి ఫిడె చెస్ ప్రపంచకప్‌లో పోటీపడిన దివ్య దేశ్‌ముఖ్.. వరల్డ్‌కప్ విజేతగా నిలిచిన భారత తొలి క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.
జగజ్జేత దివ్య దేశ్‌ముఖ్
19 ఏండ్ల దివ్య దేశ్‌ముఖ్.. 15వ సీడ్‌గా ప్రపంచకప్‌కు అండర్‌డాగ్‌గా వచ్చింది. గతంలో ఈ టోర్నమెంట్‌లో భారత్ నుంచి ఎవరూ సెమీఫైనల్‌కు చేరుకోలేదు. సహజంగానే కోనేరు హంపి, ద్రోణవల్లి హారికపైనే ఫోకస్ కనిపించింది. కానీ దివ్య దేశ్‌ముఖ్ ప్రతి రౌండ్‌లోనూ తనదైన మార్క్ చూపించింది. ప్రీ క్వార్టర్‌ఫైనల్లో మాజీ ప్రపంచ చాంపియన్ జు జినర్ (చైనా)ను మట్టికరిపించి తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించింది. క్వార్టర్‌ఫైనల్లో సహచర భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికను టైబ్రేకర్‌లో ఓడించింది. సెమీఫైనల్లో చైనా స్టార్, గ్రాండ్‌మాస్టర్ టాన్‌ను చిత్తు చేసింది. ఫైనల్లో రెండుసార్లు ర్యాపిడ్ చెస్ ప్రపంచ చాంపియన్ కోనేరు హంపిపై సాధికారిక విజయం నమోదు చేసింది. ఇంటర్నేషనల్ మాస్టర్‌గా మొదలెట్టి.. గ్రాండ్‌మాస్టర్‌గా ప్రపంచకప్‌ను దివ్య దేశ్‌ముఖ్ గ్రాండ్‌గా ముగించింది.
మిస్ కూల్… దివ్య!
ప్రపంచకప్ ఫైనల్లో తొలి రెండు గేమ్‌లు క్లాసికల్ ఫార్మాట్‌లో జరిగాయి. క్లాసికల్ ఫార్మాట్‌లో కోనేరు హంపి దిగ్గజం. ఆ రెండింట ఆమెను నిలువరించిన దివ్య దేశ్‌ముఖ్.. టైటిల్ పోరును ర్యాపిడ్ ఫార్మాట్‌కు లాక్కొచ్చింది. ర్యాపిడ్ ఫార్మాట్‌లో సమయం తక్కువగా ఉంటుంది. ఎత్తులు వేయటంలో తడబాటు అత్యంత సహజం. అయినా, కోనేరు హంపి స్వయంగా ర్యాపిడ్ ఫార్మాట్‌లో రెండు సార్లు వరల్డ్ చాంపియన్. 38 ఏండ్ల కోనేరు హంపి టైటిల్ పోరులో ఒత్తిడికి లోనవగా.. దివ్య దేశ్‌ముఖ్ కూల్‌గా కనిపించింది. క్రికెట్‌లో ఎం.ఎస్ ధోని తరహాలో చెస్‌లో దివ్య దేశ్‌ముఖ్ ఎంతో కూల్ అని ఆమె చిన్ననాటి కోచ్ అన్నారు. అందుకు తగినట్టుగా దివ్య టైబ్రేకర్‌లో సత్తా చాటింది.
టైబ్రేకర్ తొలి గేమ్‌లో దివ్య, హంపి రిస్క్ తీసుకోలేదు. హింపి పొరపాట్లు చేసినా.. దివ్య సద్వినియోగం చేసుకోలేదు. దీంతో తొలి గేమ్ 81 ఎత్తుల్లో డ్రాగా ముగిసింది. రెండో గేమ్‌లో నల్ల పావులతో ఆడిన దివ్య దేశ్‌ముఖ్.. కోనేరు హంపి కాటలాన్ ఓపెనింగ్‌ను తిప్పికొట్టింది. సమయం హంపిపై ఒత్తిడి పెంచగా.. సీనియర్ గ్రాండ్‌మాస్టర్ 40వ ఎత్తులో తడబడింది. ఇక్కడే దివ్య దేశ్‌ముఖ్ విజయానికి అవకాశం ఏర్పడింది. 54వ ఎత్తులో మరోసారి తడబడిన హంపి.. దివ్యకు గేమ్‌ను అప్పగించింది. దివ్య సైతం 67వ ఎత్తులో పొరపాటు చేసినా.. హంపి ఆ ఎత్తును డ్రా కోసం వాడుకోలేదు. 75 ఎత్తుల్లో హంపిని ఓడించిన దివ్య..19 ఏండ్లకే ఫిడె చెస్ ప్రపంచకప్ విజేతగా అవతరించింది. ఫైనల్లో విజయానంతరం.. భావోద్వేగంతో తల్లి నమ్రత దేశ్‌ముఖ్‌ను కౌగిలించుకుంది.
క్యాండిడేట్స్‌కు సై
ఫిడె చెస్ ప్రపంచకప్‌లో టాప్-3లో నిలిచిన క్రీడాకారిణీలు నేరుగా ఫిడె మహిళల 2026 క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధిస్తారు. వరల్డ్‌కప్ చాంపియన్ దివ్య దేశ్‌ముఖ్, రన్నరప్ కోనేరు హంపి సహా చైనా గ్రాండ్‌మాస్టర్ టాన్ క్యాండిడేట్స్‌కు చేరుకున్నారు. క్యాండిడేట్స్ టోర్నమెంట్ విజేత.. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ కోసం పోటీపడుతుంది.
రూ.41.6 లక్షల ప్రైజ్‌మనీ
ఫిడె చెస్ ప్రపంచకప్ విజేతగా నిలిచిన దివ్య దేశ్‌ముఖ్ (19) రూ.41.6 లక్షల (50 వేల అమెరికన్ డాలర్లు) నగదు బహుమతి దక్కించుకుంది. రన్నరప్‌గా నిలిచిన కోనేరు హంపి రూ.29.1 లక్షలు (35 వేల అమెరికన్ డాలర్లు) సొంతం చేసుకుంది.
డబుల్ ధమాకా
చదరంగంలో అత్యుత్తమ టైటిల్ గ్రాండ్‌మాస్టర్. ఈ టైటిల్ అందుకునేందుకు మూడు జీఎం (గ్రాండ్‌మాస్టర్) నార్మ్‌లు సహా 2500 రేటింగ్ పాయింట్లు సాధించాలి. దివ్య దేశ్‌ముఖ్ కెరీర్‌లో ఒక్క జీఎం నార్మ్ కూడా లేదు. ఇంటర్నేషనల్ మాస్టర్‌గా ప్రపంచకప్‌కు వచ్చిన దివ్య దేశ్‌ముఖ్.. వరల్డ్‌కప్ విజేతగా నిలిచి కిరీటంతో పాటు జీఎం హోదాను దక్కించుకుంది. గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించిన నాల్గో భారత మహిళల చెస్ క్రీడాకారిణిగా దివ్య నిలిచింది. కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, ఆర్. వైశాలి భారత్ నుంచి గ్రాండ్‌మాస్టర్ టైటిల్ సాధించిన వారిలో ఉన్నారు. ఓవరాల్‌గా (పురుషులు, మహిళలు) 88వ భారత గ్రాండ్‌మాస్టర్‌గా దివ్య నిలిచింది.
ఇప్పుడు మాట్లాడటం ఎంతో కష్టం. ఈ విజయం నాకెంతో ప్రత్యేకం. నేను ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది. ప్రపంచకప్ టైటిల్ ఆరంభం మాత్రమే అనుకుంటున్నాను. గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌ను ఇలా అందుకోవటం సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు ఇప్పటివరకు ఒక్క జీఎం నార్మ్ కూడా లేదు. కానీ ఇప్పుడు నేను గ్రాండ్‌మాస్టర్‌ను’
– దివ్య దేశ్‌ముఖ్
దివ్య దేశ్‌ముఖ్ చదరంగం క్వీన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES