Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeఆటలుజకోవిచ్‌, అల్కరాస్‌ జోరు

జకోవిచ్‌, అల్కరాస్‌ జోరు

- Advertisement -

ప్రీ క్వార్టర్స్‌కు స్టార్‌ ఆటగాళ్లు
యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌

యుఎస్‌ ఓపెన్‌లో అగ్రశ్రేణి క్రీడాకారుల జోరు కొనసాగుతుంది. వరల్డ్‌ నం.2 కార్లోస్‌ అల్కరాస్‌, వరల్డ్‌ నం.7 నొవాక్‌ జకోవిచ్‌లు పురుషుల సింగిల్స్‌లో ప్రీ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నారు. అల్కరాస్‌ ఎదురులేని విజయంతో ఆఖరు-16కు చేరుకోగా.. జకోవిచ్‌ నాలుగు సెట్ల మ్యాచ్‌లో పోరాడి గెలిచాడు. మహిళల సింగిల్స్‌లో జెస్సికా పెగులా, ఎలినా రిబకినా, మార్కెట వండ్రుసోవ ముందంజ వేశారు.

న్యూయార్క్‌ (యుఎస్‌ఏ) : ప్రపంచ టెన్నిస్‌లో ఆల్‌టైమ్‌ రికార్డు గ్రాండ్‌స్లామ్‌ వేటలో నొవాక్‌ జకోవిచ్‌ (సెర్బియా) మరో అడుగు ముందుకేశాడు. యుఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్లో జకోవిచ్‌ నాలుగు సెట్ల మ్యాచ్‌లో విజయం సాధించాడు. బ్రిటన్‌ ఆటగాడు కామెరూన్‌ నోరీపై 6-4, 6-7(4-7), 6-2, 6-3తో జకోవిచ్‌ పైచేయి సాధించాడు. సుమారు మూడు గంటల పాటు సాగిన పోరులో జకోవిచ్‌ 18 ఏస్‌లు, 51 విన్నర్లు కొట్టాడు. కామెరూన్‌ 9 ఏస్‌లు, 44 విన్నర్లతో సరిపెట్టుకున్నాడు. జకోవిచ్‌ ఐదు బ్రేక్‌ పాయింట్లు సాధించగా.. కామెరూన్‌ ఓ బ్రేక్‌ పాయింట్‌ మాత్రమే నెగ్గాడు. పాయింట్ల పరంగా 129-101తో జకోవిచ్‌ ఆధిపత్యం చూపించాడు. తొలి సెట్‌ను సులువుగా దక్కించుకున్న జకోవిచ్‌కు రెండో సెట్లో కామెరూన్‌ గట్టి పోటీ ఇచ్చాడు. 6-6తో స్కోరు సమం కాగా టైబ్రేకర్‌లో కామెరూన్‌ 7-4తో నెగ్గాడు. కానీ ఆ తర్వాత వరుస సెట్లలో జకోవిచ్‌ దూకుడుగా ఆడాడు. 6-2, 6-3తో అదరగొట్టి ప్రీ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. వరల్డ్‌ నం.2 కార్లోస్‌ అల్కరాస్‌ ఆడుతూ పాడుతూ ఆఖరు-16కు చేరుకున్నాడు. మూడో రౌండ్లో ఇటలీ ఆటగాడు లూసియానోపై 6-2, 6-4, 6-0తో అల్కరాస్‌ ఏకపక్ష విజయం సాధించాడు. ఏడు బ్రేక్‌ పాయింట్లతో ప్రత్యర్థిని చిత్తు చేసిన అల్కరాస్‌.. 9 ఏస్‌లు, 31 విన్నర్లతో రెండు గంటల్లోనే లాంఛనం ముగించాడు. పాయింట్ల పరంగా 91-56తో అల్కరాస్‌ తిరుగులేని జోరు చూపించాడు.

రెడుకాను అవుట్‌
మహిళల సింగిల్స్‌ నుంచి బ్రిటన్‌ భామ ఎమ్మా రెడుకాను నిష్క్రమించింది. శనివారం జరిగిన మూడో రౌండ్‌ మ్యాచ్‌లో కజకిస్తాన్‌ అమ్మాయి ఎలెనా రిబకినా చేతిలో వరుస సెట్లలో గంటలోనే చేతులెత్తేసింది. 3 ఏస్‌లు, నాలుగు బ్రేక్‌ పాయింట్లతో చెలరేగిన రిబకినా.. రెడుకానును 6-1,6-2తో చిత్తు చేసింది.

ఎమ్మా రెడుకాను 18 అనవసర తప్పదాలతో మూల్యం చెల్లించుకుంది. మరో మ్యాచ్‌లో జెస్సికా పెగులా (అమెరికా) 6-1, 7-5తో బెలారస్‌ అమ్మాయి విక్టోరియా అజరెంకాపై గెలుపొందింది. ఆరు బ్రేక్‌ పాయింట్లు సాధించిన జెస్సికా పెగులా.. 23 విన్నర్లు కొట్టి విక్టోరియాను గంటన్నరలో ఓడించింది. టాప్‌ సీడ్‌ అరినా సబలెంకా (బెలారస్‌) 6-3, 7-6(7-2)తో లీలా ఫెర్నాండేజ్‌ (కెనడా)పై మెరుపు విజయం సాధించింది. 6 ఏస్‌లు, 28 విన్నర్లు సాధించిన సబలెంక.. పాయింట్ల పరంగా 77-65తో ఫెర్నాండేజ్‌పై పైచేయి సాధించింది. మరో మ్యాచ్‌లో ఏడో సీజ్‌ జాస్మిన్‌ పావొలిని (ఇటలీ) 6-7(4-7), 1-6తో మార్కెట వండ్రుసోవ (చెక్‌ రిపబ్లిక్‌) చేతిలో వరుస సెట్లలో ఓటమి చెందింది. 6 ఏస్‌లు, రెండు బ్రేక్‌ పాయింట్లు సాధించిన మార్కెట.. స్టార్‌ ప్లేయర్‌ను వరుస సెట్లలో ఓడించింది. 26 అనవసర తప్పిదాలు చేసిన జాస్మిన్‌ పావొలిని ఒక్క బ్రేక్‌ పాయింట్‌ సాధించలేదు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad