Tuesday, January 20, 2026
E-PAPER
Homeఆటలుజకోవిచ్‌ శుభారంభం

జకోవిచ్‌ శుభారంభం

- Advertisement -

ఇగా స్వైటెక్‌, కాస్పర్‌ రూడ్‌ ముందంజ
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ 2026

టెన్నిస్‌ ఓపెన్‌ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించిన ఘనత సాధించేందుకు అడుగు దూరంలో నిలిచిన నొవాక్‌ జకోవిచ్‌.. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో అలవోక విజయంతో టైటిల్‌ వేటలో బోణీ కొట్టాడు. మహిళల సింగిల్స్‌ టైటిల్‌ ఫేవరేట్‌ ఇగా స్వైటెక్‌ తొలి రౌండ్లో అలవోక విజయం సాధించింది.

మెల్‌బోర్న్‌ (ఆస్ట్రేలియా)

సెర్బియా యోధుడు నొవాక్‌ జకోవిచ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో టైటిల్‌ వేట షురూ చేశాడు. పురుషుల సింగిల్స్‌లో నాల్గో సీడ్‌ జకోవిచ్‌ వరుస సెట్లలో విజయం సాధించాడు. సోమవారం జరిగిన తొలి రౌండ్లో స్పెయిన్‌ ఆటగాడు పెడ్రో మార్టినెజ్‌పై 6-3, 6-2, 6-2తో జకోవిచ్‌ అలవోక విజయం నమోదు చేశాడు. 14 ఏస్‌లు, ఐదు బ్రేక్‌ పాయింట్లతో మెరిసిన జకోవిచ్‌..పాయింట్ల పరంగా 98-57తో తిరుగులేని ఆధిపత్యం చెలాయించాడు. స్పెయిన్‌ ఆటగాడు మూడు సెట్లలో జకోవిచ్‌ సర్వ్‌ బ్రేక్‌ చేయటంలో విఫలమయ్యాడు. 6 డబుల్‌ ఫాల్ట్స్‌, 26 అనవసర తప్పిదాలతో మార్టినెజ్‌ ఏ దశలోనూ జకోవిచ్‌కు పోటీ ఇవ్వలేకపోయాడు. 49 విన్నర్లతో మెరిసిన జకోవిచ్‌.. రెండు గంటల్లోనే లాంఛనం ముగించాడు.

మరో మ్యాచ్‌లో కాస్పర్‌ రూడ్‌ (నార్వే) 6-1, 6-2, 6-4తో ఇటలీ ఆటగాడు మాటీ బెలూచీపై గెలుపొందాడు. 10 ఏస్‌లు, ఐదు బ్రేక్‌ పాయింట్లతో రాణించిన కాస్పర్‌ రూడ్‌ మెరుపు విజయంతో ముందంజ వేశాడు. ఫ్రాన్స్‌ ఆటగాడు అలెగ్జాండ్ర ముల్లర్‌ 2-6, 6-3, 3-6, 7-6(7-5), 7-6(10-4)తో అలెక్సీ పాపిరిన్‌ (ఆస్ట్రేలియా)పై ఐదు సెట్ల మ్యాచ్‌లో పైచేయి సాధించాడు. అలెక్సీ 40 ఏస్‌లు, ఐదు బ్రేక్‌ పాయింట్లతో మెరిసినా.. ముల్లర్‌ రెండు సెట్లను కీలక టైబ్రేకర్లలలో నెగ్గాడు. ఐదు ఏస్‌లు, మూడు బ్రేక్‌ పాయింట్లే సాధించినా… రెండు టైబ్రేకర్‌ విజయాలు ముల్లర్‌కు కలిసొచ్చాయి. పాయింట్ల పరంగా 161-148తో అలెక్సీ పైచేయి సాధించాడు. కానీ రెండో రౌండ్‌ బెర్త్‌ను ముల్లర్‌ దక్కించుకున్నాడు.

మారిన్‌ సిలిచ్‌ (క్రోయేషియా) 6-0, 6-0, 7-6(7-3)తో డెన్మార్క్‌ ఆటగాడు డానియల్‌ ఆల్టమీర్‌పై గెలుపొందాడు. 20 ఏస్‌లు, ఆరు బ్రేక్‌ పాయింట్లతో వరుస సెట్లలోనే సిలిచ్‌ విజయం సాధించాడు. డానియల్‌ 8 ఏస్‌లు కొట్టినా.. నాలుగు డబుల్‌ ఫాల్ట్స్‌కు పాల్పడ్డాడు. సిలిచ్‌ సర్వ్‌ కోల్పోకుండా.. ఆరుసార్లు డానియల్‌ సర్వ్‌ను బ్రేక్‌ చేసి పైచేయి సాధించాడు. ఆరో సీడ్‌, ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్స్‌ డీ 6-2, 6-2, 6-3తో మెకెంజీ మెక్‌డొనాల్డ్‌ (అమెరికా)పై గెలుపొంది ముందంజ వేశాడు. 13వ సీడ్‌ ఆండ్రీ రూబ్లెవ్‌ (చెక్‌ రిపబ్లిక్‌) 6-4, 6-2, 6-3తో మాట్టో అర్నాల్డీ (ఇటలీ)పై వరుస సెట్లలోనే విజయం సాధించాడు. టామీ పాల్‌ (అమెరికా) 6-4, 6-3, 6-3తో వరుస సెట్లలో సహచర ఆటగాడు అలెగ్జాండర్‌ కోవాసెవిచ్‌పై గెలుపొందాడు. 20 ఏస్‌లు, నాలుగు బ్రేక్‌ పాయింట్లతో టామీ పాల్‌ ఆకట్టుకున్నాడు.

స్వైటెక్‌ బోణీ
మహిళల సింగిల్స్‌లో టైటిల్‌ ఫేవరేట్‌, రెండో సీడ్‌ ఇగా స్వైటెక్‌ (పొలాండ్‌) వరుస సెట్లలో విజయం సాధించింది. చైనా అమ్మాయి యువాన్‌పై 7-6(7-5), 6-3తో స్వైటెక్‌ రెండు గంటల్లోనే గెలుపొందింది. 3 ఏస్‌లు, 5 బ్రేక్‌ పాయింట్లు సాధించిన స్వైటెక్‌ టైటిల్‌ వేటను దూకుడుగా మొదలెట్టింది. పాయింట్ల పరంగా 83-71తో స్వైటెక్‌ పైచేయి సాధించింది. స్వైటెక్‌ 24 విన్నర్లు కొట్టగా.. యువాన్‌ 28 అనవసర తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించింది. తొలి సెట్‌లో స్వైటెక్‌ను టైబ్రేకర్‌ వరకు తీసుకొచ్చిన చైనా అమ్మాయి.. రెండో సెట్లో నిరాశపరిచింది. చెక్‌ రిపబ్లిక్‌ అమ్మాయి మిర్రా అండ్రీవ 4-6, 6-3, 6-0తో క్రోయేషియా చిన్నది డొన్నా వేకిక్‌పై మూడు సెట్ల మ్యాచ్‌లో పైచేయి సాధించింది.

నాల్గో సీడ్‌, అమెరికా అమ్మాయి ఆమంద అనిషిమోవ 6-3, 6-2తో సిమోన వాల్‌టర్ట్‌ (స్విట్జర్లాండ్‌)పై వరుస సెట్లలో గెలుపొందింది. 2 ఏస్‌లు, 4 బ్రేక్‌ పాయింట్లతో ఆమంద మెరిసింది. మూడో సీడ్‌ అమెరికా స్టార్‌ కొకొ గాఫ్‌ 6-2, 6-3తో కమిలా రాకిమోవపై అలవోక విజయం సాధఙంచింది. ఓ ఏస్‌, ఆరు బ్రేక్‌ పాయింట్లతో దూకుడుగా ఆడిన గాఫ్‌ మహిళల సింగిల్స్‌లో ముందంజ వేసింది. ఆరో సీడ్‌ జెస్సికా పెగులా (అమెరికా) 6-2, 6-1తో అనస్తాసియా జాకరోవ (చెక్‌ రిపబ్లిక్‌)పై వరుస సెట్లలోనే విజయం సాధించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -