ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రీ కజగం అధ్యక్షులు విజయ్
తొలి రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభం
తిరుచ్చి : 2021 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో డీఎంకే విఫలమైందని ప్రముఖ సినీనటుడు, తమిళగ వెట్రీ కజగం (టీవీకే) అధ్యక్షులు విజయ్ విమర్శించారు. తన తొలి రాష్ట్రవ్యాప్త రాజకీయ పర్యటనను ఆయన శనివారం మధ్యాహ్నం తిరుచ్చి నుంచి ప్రారంభించారు. గతేడాదిలో టీవీకేను ప్రారంభించిన తరువాత విజయ్ తొలిసారిగా రాష్ట్రవ్యాప్త పర్యటనలో పాల్గొంటున్నారు. ఈ పర్యటన ప్రారంభం సందర్భంగా తిరుచ్చికి ఉదయం నుంచే విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. ఈ పర్యటన కోసం కారవాన్ లాంటి ప్రచార బస్సును విజయ్ ఉపయోగిస్తున్నారు. ఈ బస్సుపై సీఎన్ అన్నాదురై, ఎంజిఆర్ వంటి నాయకుల చిత్రాలను పెయింట్ చేశారు. అలాగే, ‘నేను వస్తున్నాను’ అనే నినాదం కూడా ఉంది. తిరుచ్చి తరువాత శనివారం అరియలూర్, పెరంబలూర్, మరక్కడైలో విజయ్ ప్రసంగించారు. అధికార డీఎంకేపై విమర్శలకు దిగారు. అలాగే, తిరుచ్చిలో మాట్లాడుతూ ఈ నగర రాజకీయ ప్రాముఖ్యతను గుర్తు చేశారు. తిరుచ్చిలో జరిగే ఏ రాజకీయ కార్యక్రమమైనా ఒక మలుపు తిరుగుతుందని విజయ్ పేర్కొన్నారు, ఇందుకు ఉదాహరణగా 1956లో మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై రాజకీయాల్లోకి తన ప్రవేశాన్ని ప్రకటించడానికి తిరుచ్చిని ఎంచుకున్నారని, ఎంజి రామచంద్రన్ తన మొదటి రాష్ట్ర పార్టీ సమావేశాన్ని కూడా నగరంలోనే నిర్వహించారని విజయ్ గుర్తు చేసుకున్నారు. చారిత్రాత్మకంగా, మత సామరస్యానికి ప్రతీకగా, ప్రముఖ విద్యా కేంద్రంగా తిరుచ్చి గొప్ప ఖ్యాతి పొందిందని తెలిపారు.