– ఈసీ వైఖరిపై పిటిషనర్ల వాదనలు
– సర్‌ను కొనసాగించాల్సిందే
– అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించాలి : స్పష్టం చేసిన సుప్రీం
– పిటిషన్లు వెల్లువెత్తడంపై సుప్రీం అసహనం
న్యూఢిల్లీ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఎన్నికల కమిషన్ సాగిస్తున్న ప్రక్రియను సవాలు చేస్తూ పలువురు పిటిషనర్లు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ ప్రక్రియ మొత్తంగా అన్యాయంగా వుందని, 140కోట్ల మంది పౌరులపై తమ పౌరసత్వాన్ని నిరూపించుకునే భారం పడుతోందని పిటిషనర్లు వాదించారు. ఇటువంటి పరిస్థితి ఓటు హక్కు లేకుండా పోవడానికి, ప్రస్తుత ఓటర్లయిన చాలామందికి తమ దేశం అంటూ లేకుండా పోవడానికి దారి తీస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ పౌరసత్వాన్ని నిరూపించుకునే పత్రాలు చూపలేని పక్షంలో లక్షలాదిమంది తమ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదముందని అన్నారు. ఎన్నికల కమిషన్‌కు పౌరసత్వాన్ని పరిశీలించే అధికారం లేదని వారు పేర్కొన్నారు. పౌరసత్వ చట్టం కింద అటువంటి అధికారం ప్రభుత్వానికి చెంది వుంటుందన్నారు. అసలు ఎన్నికల కమిషన్ తీసుకునే చర్యలు రాజ్యాంగబద్ధమేనా అని వారు ప్రశ్నించారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు షాదన్ ఫరాసత్, ప్రశాంతో సేన్, నిజామ్ పాషా ప్రభృతులు తమ వాదనలు వినిపించారు. ఇసి చేపట్టిన ఈ ప్రక్రియ చట్టబద్ధతపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. బృహత్తర స్థాయిలో చేపట్టిన ఈ ప్రక్రియకు చట్టబద్ధమైన ఫ్రేమ్‌వర్క్ కొరవడం పట్ల కూడా వారు ఆందోళన వెలిబుచ్చారు. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో మైనారిటీలను, ఇతర నిర్దిష్ట గ్రూపులను ఈ ప్రక్రియ కింద లక్ష్యంగా చేసుకోవడాన్ని కూడా వారు ఎత్తిచూపారు.
అసలు అంశం ఎప్పుడు విచారిస్తాం ?
సర్‌ను సవాలు చేస్తూ ఉత్తరప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ వంటి రాష్ట్రాల నుంచి పలు పిటిషన్లు దాఖలవుతుండడం పట్ల సుప్రీం కోర్టు మంగళవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ”రాజకీయ వ్యక్తులందరూ వెలుగులోకి రావడానికి ఇక్కడకు వస్తున్నారు.అదే మా ఆందోళన”అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. మరిన్ని పిటిషన్లు దాఖలు చేస్తూ ఈ అంశాన్ని మరింత రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సర్‌కు సంబంధించిన పిటిషన్లను రాష్ట్రాలవారీగా వేరు చేయాల్సిందిగా సూర్యకాంత్, జోమాల్యా బాగ్చిలతో కూడిన బెంచ్ ఆదేశించింది.
అప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నుంచి దాఖలైన పిటిషన్లను వేరువేరుగా విచారిస్తామని తెలిపింది. కొత్తగా దాఖలైన ఐదు పిటిషన్లపై నోటీసులు జారీ చేసింది. ఇవి ఇలాగే కొనసాగుతూ పోతే ప్రధాన అంశమైన సర్ చట్టబద్ధతపై ఇక ఎప్పుడు విచారిస్తామని ఆందోళన వ్యక్తం చేసింది. ముందుగా ప్రాధాన్యతా ప్రాతిపదికన బీహార్‌లో సర్ చట్టబద్ధతను నిర్ణయించడం ముఖ్యమని చీఫ్ జస్టిస్ స్పష్టం చేశారు. ఎందుకంటే ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియను ప్రభావితం చేస్తుందన్నారు. అలాగే సర్ ప్రక్రియ నుంచి అసోంను ఎందుకు విడిచిపెట్టారని ప్రశ్నిస్తూ ఎన్నికల కమిషన్‌కు సుప్రీం కోర్టు నోటీసు ఇచ్చింది. కాగా ఎన్యూమరేషన్ ఫారాలను అందచేసే గడువును పొడిగించాల్సిందిగా తమిళనాడు కోరింది. ప్రస్తుతం శబరిమల యాత్ర కొనసాగుతున్నందున దీన్ని దృష్టిలో వుంచుకుని చర్యలు తీసుకోవాలని కోరింది.
బెంగాల్‌పై ఈసీ, కేంద్రానికి నోటీసులు
బూత్ లెవల్ అధికారుల (బీఎల్‌ఓ) భద్రత కోసం పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించాలని కోరుతున్న పిటిషన్‌పై కూడా సుప్రీం స్పందించింది. దీనిపై ఈసీ, కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ, అరాచకత్వాన్ని ఎంత మాత్రమూ అనుమతించేది లేదని స్పష్టం చేసింది. బీఎల్‌ఓల భద్రతకు హామీ కల్పించేలా ఇసి సకాలంలో చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని పేర్కొంది.
అదనపు సిబ్బందిని నియమించాలి
తీవ్రమైన ఒత్తిళ్ళతో కొనసాగుతున్న సర్ విధులను నిర్వర్తించేందుకు ప్రస్తుతమున్న బీఎల్‌ఓలు సుముఖంగా లేని పక్షంలో వారి స్థానంలో వేరేవారిని నియమించాలని, అవసరమైతే అదనపు బీఎల్‌ఓలను కూడా ఏర్పాటు చేయాలని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చిలతో కూడిన బెంచ్ రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఒకవేళ ఏ రాష్ట్ర ప్రభుత్వం నుండైనా సహకారం కొరవడితే వెంటనే ఈసీ తమకు తెలియచేయవచ్చని జస్టిస్ బాగ్చి తెలిపారు.
140 కోట్లమంది పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిందేనా !
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



