రెండేళ్లు గడుస్తున్నా నయాపైసా ఇవ్వని వైనం..
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని తాడిచెర్ల, కిషన్ రావుపల్లి, డబ్బగట్టు, దుబ్బపేట గ్రామాల్లో 5 మంది ఆయాలు, తాడిచెర్ల, పెద్దతూండ్ల, దుబ్బపేట గ్రామాల్లో 5 మంది టీచర్లు 65 ఏళ్ల వయస్సు నిండటంతో రెండేళ్ల కింద పదవీ విరమణ చేశారు. అయితే.. ప్రభుత్వం ఇప్పటి వరకు వారికి రిటైర్మెంట్ బెన్ఫిట్ అందించలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండేళ్లుగా ఎదురు చూపులు
అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసిన ఆయాలు, టీచర్లు పదవీ విరమణ చేసినా ప్రభుత్వం ప్రకటించిన సాయాన్ని అందించకపోవడంతో సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేసేవారిలో 65 ఏళ్ల వయస్సు నిండిన వారిని పదవీ విరమణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మండలంలో 5 మంది ఆయాలు, 5 మంది టీచర్లను రిటైర్మెంట్ చేయించింది. పదవి విరమణ చేసిన ఆయాలకు రూ.50 వేల చొప్పున, టీచర్లకు రూ.1లక్ష వరకు సాయం అందిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఆయాలకు రూ.1 లక్ష, టీచర్లకు రూ.2 లక్షలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినా ఉత్తర్వులలో మాత్రం 50 శాతం కోత విధించింది.
ఉత్తర్వుల ప్రకారమైనా మండలంలో ఆయాలు, టీచర్లకు రూ.7.50 లక్షల నిధులను విడుదల చేస్తే సరిపోతుంది. రెండేళ్లుగా రిటైర్ అయిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు బెన్ఫిట్స్ కోసం నిరీక్షిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. ఇప్పటికైనా పదవీ విరమణ చేసిన అంగన్వాడీ ఆయాలు, టీచర్లకు బెనిఫిట్ సొమ్ము విడుదల చేయాలని కోరుతున్నారు. నిధులు విడదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్తున్నారు.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం: భాగ్యలక్ష్మి..సూపర్ వైజర్
పదవీ విరమణ చేసిన ఆయాలు, అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద మంజూరు కావాల్సిన డబ్బుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం మంజూరు చేయగానే వారికి సొమ్మును అందజేస్తాం.



