ధవ వరండాలో కూర్చొని చదువుకుంటున్నాడు. పక్కనే తండ్రి నవ తెలంగాణ దినపత్రిక చదువుతున్నాడు. ఇంతలో గుర్ఖా వచ్చి గేటు శబ్థం చేశాడు. తండ్రి తలెత్తి చూశాడు. అతడు తండ్రికి నమస్కారం పెట్టి నెలవారీ డబ్బుల కోసం చేయి చాపాడు. ధవకు అతడ్ని చూస్తే జాలేసింది. నలిగిపోయిన బట్టలు, మాసిన గడ్డం, నిద్రలేమితో ఉన్నాడు. పైగా బక్కపలచగా ఉన్నాడు. మాట కూడా సరిగ్గా రావటం లేదు. తండ్రి ధవతో అమ్మనడిగి ఇరవై రూపాయలు తెచ్చి గుర్ఖాకు ఇవ్వమన్నాడు. ధవ లోపలికి వెళ్లి తల్లిని ఇరవై రూపాయలు అడిగాడు. ఆమె గుర్ఖాను రేపు రమ్మను.. ఈరోజు శుక్రవారం ఇవ్వకూడదు అన్నది. అదేంటమ్మా! ఇరవై రూపాయల కోసం గుర్ఖా రేపు రావాలా! అన్నాడు. అవును శుక్రవారం డబ్బులు ఇస్తే లక్ష్మీదేవి వెళ్లిపోతుంది. అందుకే ఇవ్వను నిర్మొహమాటంగా చెప్పింది. ధవకు తల్లి మాటలు బాధ కలిగించాయి. తల్లితో అమ్మా! ఇరవై రూపాయలు ఇస్తే లక్ష్మీదేవి వెళ్లిపోతుందన్నావు. మరి ఉదయాన్నే పక్కింటి ఆంటీ నీకు రెండు వందలు ఇస్తే ఎలా తీసుకున్నావు? ప్రశ్నించాడు. ఆమె మనకు బాకీ ఉంది. అందుకే తీసుకున్నాను. శుక్రవారం పూట ఎవరైనా డబ్బులు ఇస్తే వద్దనకూడదు. అలా వద్దంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది.. ున ఇంటికి రాదు అన్నది. అప్పుడు ధవ అమ్మా! నువ్వు చెప్పింది నిజమే. డబ్బులు తీసుకున్న తర్వాత లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుందిగా! ఎక్కడికీ పోదుగదమ్మా! గుర్ఖాను చూస్తుంటే జాలేస్తుంది. ఇరవై రూపాయల కోసం మన ఇంటి ముందు నిలబడ్డాడు. రాత్రిళ్లు నిద్రపోకుండా.. ఇళ్లల్లో దొంగలు పడకుండా గస్తీ తిరుగుతుంటాడు. అలాంటి వ్యక్తికి ఇరవై రూపాయలు ఇస్తే తప్పేంటి? లక్ష్మీదేవి కూడా నిన్ను దీవిస్తుందమ్మా! అన్నాడు. చిన్నవాడైన ధవ మాటలు ఆమెను కదిలించాయి. నమ్మకం ఉండొచ్చు కానీ మూఢ నమ్మకం పనికిరాదని భావించింది. ఇరవై రూపాయల కోసం అతడ్ని నిలబెట్టటం భావ్యం కాదనుకుంది. ధవకు ఇరవై ఇచ్చి గుర్ఖాకు ఇవ్వమన్నది. ధవ డబ్బులు తీసుకుని ఆనందంతో అతనికి ఇచ్చాడు.
తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర, 9492309100



