– ప్రియుడి ఇంటిముందు చంటి బిడ్డతో ప్రియురాలి ధర్నా
నవతెలంగాణ – నకిరేకల్ : నాకు, నా బిడ్డకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు చంటి బిడ్డతో ధర్నా చేసిన ఘటన మండలంలోని నెల్లిబండ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు బోయిల రేణుక తెలిపిన వివరాల ప్రకారం శాలిగౌరారం మండలం అడ్లూరు గ్రామానికి చెందిన తనకు నెల్లిబండ గ్రామానికి చెందిన భోయిల అశోక్ తో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొన్నేళ్ళకు అశోక్ అనారోగ్యంతో మృతి చెందాడు. అశోక్ ఉన్నప్పటినుండే అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్న ఓరుగంటి విష్ణు తో తనకు వివాహేతర సంబంధం ఉందని తెలిపింది. అశోక్ మృతి చెందిన తర్వాత నీకు అండగా నేనుంటానని నమ్మబలికాడు.
దీంతో రెండు, మూడు సార్లు అబార్షన్లు సైతం చేయించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అబార్షన్లు చేయించడం ఏంటి అని గట్టిగా నిలదీయడంతో నాకు వివాహం జరిగింది. ఇద్దరూ పిల్లలు. నీ కులం వేరు, నా కులం వేరు. నిన్ను నేను ఎలా పెళ్లి చేసుకోగలను..? అనడంతో మా ఇద్దరి మధ్య సంఘర్షణ మొదలై దూరంగా ఉంటున్నామన్నారు. ఇదే విషయాన్ని పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడితే ప్రెగ్నెన్సీ తీయించుకుంటే రూ.5 లక్షలు ఇస్తామని చెప్పడంతో నేను ససేమిరా వినకుండా బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం నా బిడ్డకు, నాకు న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. శనివారం స్థానిక గ్రామపంచాయతీ వద్ద పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.



