Saturday, January 31, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరక్షిత కౌలు భూములు తీసుకోవద్దు

రక్షిత కౌలు భూములు తీసుకోవద్దు

- Advertisement -

– నాలుగు తరాలుగా సాగులో రైతులు
– దేవాలయం పేరుతో మోసం
– రికార్డు ప్రకారం రైతులందరికీ పట్టాలివ్వాలి : సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య
– యాచారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రైతులతో ధర్నా
నవతెలంగాణ-యాచారం
రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్‌ సిటీ పేరుతో రక్షిత కౌలుదారు భూములను తీసుకోవద్దని సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్‌ చేశారు. శుక్రవారం రక్షిత కౌలుదారు రైతులతో కలిసి రంగారెడ్డి జిల్లా యాచారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కౌలుదారు రికార్డు ఎక్కించి రైతులందరికీ వెంటనే పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. సింగారం, కుర్మిద్ధ గ్రామాల సర్పంచులు ఈ ధర్నాకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ.. నాలుగు తరాలుగా సాగులో ఉండి జీవనం సాగిస్తున్న రైతులకు పట్టాలివ్వకపోవడం దారుణమన్నారు. ఓంకారేశ్వర ఆలయం పేరుతో రెవెన్యూ అధికారులు, ప్రభుత్వం భూములను రికార్డుకు ఎక్కించకుండా రైతులను మోసం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డు ప్రకారం రైతులకు పట్టాలెందుకు ఇవ్వడం లేదని అధికారులను ప్రశ్నించారు. ఫ్యూచర్‌ సిటీ పేరుతో యాచారం మండల పరిధిలోని నందివనపర్తి, తాడిపర్తి, కుర్మిద్ధ, సింగారం గ్రామాల పరిధిలో 1400 ఎకరాల రక్షిత కౌలు భూములపై ప్రభుత్వం కన్నేసిందని విమర్శించారు. కార్పొరేట్‌, బడా కంపెనీలకు పేద రైతుల భూములను అప్పజెప్పడానికి ప్రభుత్వం పూనుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ ప్రాంతంలో ప్రజల జీవనోపాధిని దెబ్బతీసే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు.. రక్షిత కౌలు భూములను ఆన్‌లైన్‌ చేసి, పాత వాటిస్థానంలో కొత్త పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే.. రైతులకు న్యాయం జరిగేంతవరకూ తమ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ, జిల్లా కమిటీ సభ్యులు పి.అంజయ్య, మండల కమిటీ సభ్యులు చందునాయక్‌, సర్పంచులు బోడ కృష్ణ, శ్రీవిద్య, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -