Thursday, April 9, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుదుకాణాలను వేలం వేయొద్దు

దుకాణాలను వేలం వేయొద్దు

- Advertisement -

సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్ల సముదాయాల్లోని వాణిజ్య దుకాణాల వేలం విక్రయాలను నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. బుధవారం ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ లేఖ రాశారు. మేడ్చల్‌ మల్కాజిగిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని డబుల్‌ బెడ్రూం కాలనీల్లోని సుమారు 992 వాణిజ్య సముదాయాలను వేలం పద్ధతిలో విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏప్రిల్‌ రెండో వారంలో వేలం వేయబోతున్నట్టు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటనలు విడుదల చేయడాన్ని ప్రస్తావించారు. పేద ప్రజల, నివాసితుల ప్రయోజనాలను దెబ్బతీసే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును డిపాజిట్‌ చేసి ఆ వడ్డీతో లేదా అధికారుల అనుమతితో కాలనీ మెయింటెనెన్స్‌కు ఖర్చు చేస్తామనే ప్రభుత్వ ఆలోచన ఆచరణాత్మకం కాదని స్పష్టం చేశారు.

ప్రతి చిన్న మరమ్మతుకు జిల్లా అధికారుల చుట్టూ తిరగడం నివాసితులకు సాధ్యం కాదనీ, వాటిని విక్రయిస్తే కాలనీల్లోని లిఫ్టులు, ఇతర మెయింటెనెన్స్‌ ఖర్చులు, నిర్వహణ భారం అంతా అక్కడ నివసించే వారిపైనే పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. షాపులను అద్దెకిస్తే అద్దెలు సరిగా రావనే వాదన సహేతుకం కాదని తెలిపారు. ప్రతి రెండూ మూడేండ్లకోసారి పారదర్శకమైన వేలం ద్వారా అద్దెకిచ్చి, ప్రజలు ఎన్నుకున్న కమిటీల ద్వారా వాటిని పర్యవేక్షించాలనీ, అప్పుడు అద్దె విలువ పెరిగి కాలనీల అభివృద్ధికి అధిక ఆదాయం సమకూరుతుందని సూచించారు. ఇండ్ల మరమ్మతులకు, అభివృద్ధి పనులకు, అసంపూర్ణంగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేశారు. శాశ్వత నిర్వహణం కోసం ప్రత్యేకంగా ‘కార్పస్‌ ఫండ్‌’ ఏర్పాటు చేయాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -