Tuesday, January 20, 2026
E-PAPER
Homeజాతీయంప్రజలకు అసౌకర్యం కల్పించవద్దు

ప్రజలకు అసౌకర్యం కల్పించవద్దు

- Advertisement -

బెంగాల్‌ ‘సర్‌’పై ఈసీకి సుప్రీం ఆదేశాలు
న్యూఢిల్లీ :
పశ్చిమ బెంగాల్‌లో ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (సర్‌) ప్రక్రియలో భాగంగా పరిశీలన సమయంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం, ఒత్తిడి కలగకుండా చూడాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఓటర్లు సమర్పించిన పత్రాలలో తేడాలు, పదో తరగతి అడ్మిట్‌ కార్డుల చెల్లుబాటుకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌, న్యాయమూర్తులు జారుమాల్యా బగ్చీతో కూడిన సుప్రీం బెంచ్‌ పలు ఆదేశాలు జారీ చేసింది. సర్‌ ప్రక్రియలో భాగంగా పదో తరగతి అడ్మిట్‌ కార్డులను అంగీకరించాలని సూచించింది. బెంగాల్‌లో అడ్మిట్‌ కార్డులో పుట్టిన తేదీ మాత్రమే ఉంటుందని ఈసీ వాదించగా ‘పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర విద్యా బోర్డు అడ్మిట్‌ కార్డు పుట్టిన తేదీని సూచిస్తుంది. పాస్‌ సర్టిఫికెట్‌లో కాదు. మీరు పాస్‌ సర్టిఫికెట్‌ కోసం పట్టుబడితే అందులో పుట్టిన తేదీ ఉండదు. అందుకోసం మీరు అడ్మిట్‌ కార్డును అనుమతించాల్సి ఉంటుంది’ అని జస్టిస్‌ దత్తా తెలిపారు. చిన్న చిన్న కారణాలు చూపుతూ నోటీసులు జారీ చేసిన ఓటర్ల జాబితాను ప్రచురించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. చిన్న చిన్న తేడాలను ఎత్తిచూపుతూ 1.25 కోట్ల నోటీసులు జారీ చేశారని కోర్టు తెలిపింది. వారందరూ ఏజెంట్లు, బీఎల్‌ఓల ద్వారా పత్రాలు సమర్పించవచ్చునని చెప్పింది. నోటీసులకు సమాధానం ఇవ్వడానికి వంద కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని కోర్టు ప్రస్తావిస్తూ ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి స్థానిక కార్యాలయాలలో ఏర్పాట్లు చేయాలని సూచించింది. పత్రాలు సంతృప్తికరంగా లేవని తేలిన వ్యక్తులను విచారించడానికి అవకాశం కల్పించాలని, వారి అధీకృత ఏజెంట్లు కూడా హాజరు కావచ్చునని చెప్పింది. తల్లిదండ్రులు, పిల్లల మధ్య వయసులో అంతరం తక్కువగా ఉందంటూ ఎందుకు నోటీసులు జారీ చేస్తున్నారని జస్టిస్‌ బాగ్చీ ప్రశ్నించారు. సర్‌ ప్రక్రియను పూర్తి చేయడానికి తగినంత మంది సిబ్బందిని నియోగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు సూచించింది. ఓటరు జాబితాలో సవరణలు చేయవచ్చునని, అయితే ఆ దిద్దుబాట్లు పారదర్శకంగా ఉండాలని అభిప్రాయపడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -