– మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మైనారిటీ గురుకుల సిబ్బంది వేతనాల్లో కోత విధించొద్దని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యాకూబ్ పాషా డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 205 మైనారిటీ పాఠశాలలు, కళాశాలల్లో పని చేస్తున్న సుమారు 5 వేల మంది బోధన, బోధనేతర ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల్లో కోత విధిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే వారిని ఆదుకోవాలని కోరారు. నెలకు కేవలం రూ. 12 వేల నుంచి రూ. 15 వేల లోపు స్వల్ప వేతనాలతో కుటుంబాన్ని పోషిం చుకుంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో కేవలం 10 నెలల జీతం ఇచ్చి రెండు నెలలు కోత విధించేవారనీ, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పాత విధానాన్ని అనుసరించడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గతంలో ఎలక్ట్రీషియన్లు, మహిళా సెక్యూరిటీ గార్డులు, హౌస్ కీపింగ్ వంటి సిబ్బందికి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ఈపీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు ఉండేవనీ.అయితే ప్రస్తుత ప్రభుత్వం వారిని డైలీ వేజెస్ (రోజువారీ కూలీ) కింద మార్చి ఆ సదుపాయాలను తొలగించడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి వేతనాల్లో కోతలు లేకుండా పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించి, వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
మైనారిటీ గురుకుల సిబ్బంది వేతనాల్లో కోత విధించొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



