Sunday, December 28, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలువర్కింగ్‌ జర్నలిస్టులను విభజించొద్దు

వర్కింగ్‌ జర్నలిస్టులను విభజించొద్దు

- Advertisement -

డెస్క్‌ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలి
డెస్క్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ డిమాండ్‌
హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట భారీ నిరసన
అదనపు కలెక్టర్‌కు వినపత్రం అందజేత
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు


నవతెలంగాణ- సిటీబ్యూరో
వర్కింగ్‌ జర్నలిస్టులను అక్రిడిటేషన్లు, మీడియా కార్డుల పేరుతో విభజించొద్దని డెస్క్‌ జర్నలిస్ట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ(డీజేఎఫ్‌టీ) రాష్ట్ర అధ్యక్షులు బాదిని ఉపేందర్‌, ప్రధాన కార్యదర్శి ఎస్‌కే మస్తాన్‌ ప్రభుత్వాన్ని కోరారు. డెస్క్‌ జర్నలిస్టులకు పాత పద్ధతిలోనే అక్రిడిటేషన్‌ కార్డులు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట నిరసన చేపట్టి కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. అందులో భాగంగా లక్డీకాపూల్‌లోని హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట నిరసన కార్యక్రమంలో వివిధ పత్రికల డెస్క్‌ జర్నలిస్టులు పెద్దసంఖ్యలో హాజరవ్వగా.. టీడబ్ల్యూజేఎఫ్‌, హెచ్‌యూజే, ఎస్‌జాట్‌ మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా డీజేఎఫ్‌టీ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ.. డెస్క్‌ జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌ కార్డులు తీసేసి మీడియా కార్డులు ఇవ్వడం సరికాదన్నారు. ఇది జర్నలిస్టుల పట్ల వివక్ష చూపినట్టవుతుందన్నారు.

జీవో నెంబర్‌ 252ను సవరించాలని, స్పోర్ట్స్‌, సినిమా, ఫీచర్స్‌, వెబ్‌, కల్చరల్‌, బిజినెస్‌, కార్టునిస్టులకు గతంలో మాదిరిగానే అక్రిడిటేషన్‌ కార్డులివ్వాలని డిమాండ్‌ చేశారు. డీజేఎఫ్‌టీ రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ పి.విజయ మాట్లాడుతూ.. జర్నలిస్టుల మధ్య విభజన తీసుకురావడం సరికాదని అన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే సవరించడం తోపాటు గతంలో మహిళా జర్నలిస్టులు పోరాడి సాధించుకున్న అక్రిడిటేషన్లలో 33శాతం రిజర్వేషన్‌ అమలుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. అనంతరం అదనపు కలెక్టర్‌ కదిరవన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో డీజేఎఫ్‌టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవీ రాజారామ్‌, కోశాధికారి నిసార్‌, టీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.రాజశేఖర్‌, హెచ్‌యూజే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గండ్ర నవీన్‌, ప్రధాన కార్యదర్శి బి.జగదీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాల్లో..
అక్రిడిటేషన్లకు సంబంధించి 252 జీవోను సవరించాలని కోరుతూ మిగతా జిల్లాల్లోనూ ఆందో ళన కార్యక్రమాలు జరిగాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కలెక్టరేట్ల ఎదుట డెస్కు జర్నలిస్టులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. నల్లగొండ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాలో ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, డిజిటల్‌, డెస్క్‌, కేబుల్‌, ఇండిపెండెంట్‌ జర్నలిస్టులు పాల్గొన్నారు. నిజామాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. జర్నలిస్టుల ఆందోళనకు వివిధ జర్నలిస్టు సంఘాలు మద్దతు తెలిపాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లా కలెక్టరేట్ల ఎదుట భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. వర్కింగ్‌ జర్నలిస్టు లను విభజించకుండా అర్హులైన అందరికీ అక్రిడిటేషన్లు జారీ చేయాలని ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ ఏఓకు వినతిపత్రం అందజేశారు. డెస్క్‌ జర్నలిస్టుల పై ప్రభుత్వం వివక్షత వీడాలని జీఓ నెం.252ను రద్దు చేయాలంటూ మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లా సబ్‌ఎడిటర్లు డిమాండ్‌ చేశారు. ఇంకా మిగతా చోట్ల కూడా జర్నలిస్టులు కార్యక్రమాలు నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -