Tuesday, October 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబలవంతపు భూసేకరణ చేయొద్దు

బలవంతపు భూసేకరణ చేయొద్దు

- Advertisement -

పంటలు పండే భూములు కంపెనీలకు ఇవ్వొద్దు
బీఆర్‌ఎస్‌ విధానాలను అవలంబిస్తోన్న కాంగ్రెస్‌
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్‌
భూములు తీసుకోవడంలో రేవంత్‌, కేసీఆర్‌ ఒక్కటే
భూసేకరణ నోటిఫికేషను రద్దు చేయాలి
వ్యకాస జిల్లా అధ్యక్షులు రాంచందర్‌
సంగారెడ్డి కలెక్టరేట్‌ ఎదుట నిమ్జ్‌ భూ నిర్వాసితుల ధర్నా

నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
నిమ్జ్‌ పేరిట రైతుల నుంచి బలవంతపు భూసేకరణ చేయొద్దని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్‌ డిమాండ్‌ చేశారు. ఝరాసంగం మండలం ఎల్గోయి గ్రామంలో రైతుల నుంచి భూసేకరణకు కలెక్టర్‌ నోటిఫికేషన్‌ వేశారని, దాన్ని విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట నిమ్జ్‌ బాధితులతో ధర్నా నిర్వహించారు. రైతులకు మద్దతుగా సీపీఐ(ఎం) పార్టీ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా జయరాజ్‌ మాట్లాడుతూ.. నిమ్జ్‌ కోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనుసరించిన విధానాలనే కాంగ్రెస్‌ ప్రభుత్వమూ అనుసరిస్తుందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2013 భూసేకరణ చట్టంలోని చాప్టర్‌ 2,3 యధావిధిగా పెట్టాలని డిమాండ్‌ చేశారు. సారవంతమైన బహుళ పంటలు పండే భూములను ఏ విధంగా తీసుకొంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసా రంగా నోటిఫికేషన్‌ వేసి రైతులను బయపెట్టడం అన్యాయమని అన్నారు. రైతులు చేసే పోరాటానికి సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు.

భూములు తీసుకోవడంలో రేవంత్‌, కేసీఆర్‌ ఒక్కటే : వ్యకాస జిల్లా అధ్యక్షులు బి.రాంచందర్‌
భూములు తీసుకోవడంలో కేసీఆర్‌, రేవంత్‌ ఇద్దరూ ఒక్కటేనని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి.రాంచందర్‌ అన్నారు. నిమ్జ్‌ కోసం గ్రామంలో గతంలో 1800 ఎకరాలు సేకరించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ కూడా పెట్టలేదన్నారు. ఇప్పుడు ఝరాసంగం మండలంలోని ఎల్గోయి గ్రామంలో 195 ఎకరాల భూసేకరణకు కలెక్టర్‌ వేసిన నోటిఫికేషన్‌ వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. గ్రామంలో ఎంతో సారవంతమైన బహుళ పంటలు పండే భూములను, వ్యవసాయ భూములను పరిశ్రమల పేరుతో అక్రమంగా తప్పుడు రిపోర్టులతో నోటిఫికేషన్లు వేసి రైతులని భయభ్రాంతులకు గురి చేయడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం గతంలో గ్రామంలో భూసేకరణ చేసిన సందర్భంగా మళ్ళీ రైతుల భూముల జోలికి రామని హామీ ఇచ్చిన అధికారులు తిరిగి మళ్లీ నోటిఫికేషన్‌ వేయడం అన్యాయమని అన్నారు. ఎట్టి పరిస్థితిల్లో భూములను వదిలేదని స్పష్టంచేశారు. ప్రభుత్వం, అధికారులు ఏకపక్షంగా ముందుకు వెళితే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -