Monday, December 22, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంపరిస్థితిని ఉద్రిక్తంగా మార్చొద్దు

పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చొద్దు

- Advertisement -

అలాంటి ఘోర తప్పు చేయొద్దు
అమెరికాకు రష్యా హెచ్చరిక
యూఎస్‌-వెనిజులా ఉద్రిక్తతల నడుమ పుతిన్‌ వార్నింగ్‌

వాషింగ్టన్‌, కారకాస్‌, మాస్కో : అమెరికా-వెనిజులా మధ్య యుద్ధ పరిస్థితులు ముదురుతున్న తరుణంలో రష్యా నుంచి బలమైన వార్నింగ్‌ వచ్చింది. పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చే ఘోర తప్పు చేయవద్దని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు రష్యా అధినేత పుతిన్‌ హెచ్చరికలు పంపారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్‌ తెలిపింది. ”ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు వేగంగా పెరుగుతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితికి దారి తీయొచ్చు” అని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి చెప్పారు. ఉక్రెయిన్‌తో యుద్ధం, అమెరికా-వెనిజులా మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రష్యా నుంచి ఇలాంటి హెచ్చరికలు రావటం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గత కొన్ని రోజులగా అమెరికా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. వెనిజులాను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నది. ఇటీవల కరేబియన్‌ సముద్రం, తూర్పు పసిఫిక్‌లో డ్రగ్‌ రవాణాతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో అమెరికా కొన్ని నౌకలపై దాడులకు దిగిన విషయం విదితమే.

ఇవే పరిణామాలు వెనిజులా చుట్టూ భారీ అమెరికా సైనిక సమీకరణకు దారి తీశాయి. ప్రస్తుతం కరేబియన్‌ ప్రాంతంలో 11 అమెరికా యుద్ధ నౌకలను మోహరించారు. వేలాది మంది సైనికులు అక్కడ పని చేస్తున్నారు. ప్యూర్టో రికో సహా అనేక స్థావరాల నుంచి వెనిజులా తీరరేఖ వెంట గస్తీ విమానాలు ఎగురుతున్నాయి. ఇదే సమయంలో ట్రంప్‌.. వెనిజులా నుంచి వెళ్లే, వచ్చే నిషేధిత చమురు ట్యాంకర్లపై ‘పూర్తి నిర్బంధం’ విధిస్తున్నట్టు ప్రకటించారు. ఇది యుద్ధ చర్యలకు సంకేతంగా ఉన్నదని అమెరికాకు చెందిన కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా చమురు కోసం రక్తపాతం వద్దని వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో ఓ ర్యాలీలో ప్రసంగిస్తూ చెప్పారు. ”యుద్ధం వద్దు.. మెర్రీ క్రిస్మస్‌! ఆందోళన వద్దు, ఆనందంగా ఉండండి” అని సందేశమిచ్చారు. కాగా అమెరికా-వెనిజులా మధ్య నెలొకన్న ఉద్రిక్త పరిస్థితిని నివారించేందుకు బ్రెజిల్‌ అధ్యక్షుడు లులా మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రకటించారు. ఇటు చైనా వెనిజులాకు మద్దతుగా ఉన్నది. అమెరికా ఒత్తిడిని విమర్శించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -