హైకోర్టు స్పష్టీకరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రంగారెడ్డి జిల్లాలో ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రహదారి నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ విషయంలో రైతులకు హైకోర్టు ఉపశమనం కల్పించింది. ఆమన్‌గల్ ప్రాంతంలో మీర్‌ఖాన్‌పేట ఔటర్ రింగు రోడ్ నుంచి రీజినల్ రింగు రోడ్ వరకు చేపట్టనున్న పనుల కోసం భూములు స్వాధీనం చేసుకునే ప్రక్రియలో అవార్డు ప్రకటించే దశ వచ్చే వరకు భూ యజమానులను ఖాళీ చేయించొద్దని హైకోర్టు సోమవారం స్పష్టం చేసింది. కోర్టును ఆశ్రయించిన 30 మంది రైతులకు చెందిన 61 ఎకరాల భూమికి ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది. యాచారం, కడ్తాల్, ఆమన్‌గల్ మండలాల్లోని పలు గ్రామాల్లో మొత్తం 554.34 ఎకరాల భూసేకరణకు జారీ చేసిన నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ అన్నేపు జంగయ్యతోపాటు మరికొందరు పిటిషన్ దాఖలు చేశారు.
విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాది భూసేకరణ చట్ట ప్రక్రియలను పాటించలేదనీ, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదని వాదించారు. భూయజమానులకు అభ్యంతరాలు చెప్పే అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ప్రభుత్వ తరఫున అడ్వకేట్ జనరల్ ఎ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ మొత్తం భూసేకరణలో కొంత భాగంపైనే వివాదం ఉందనీ, కొంత భూమికి ఇప్పటికే పరిహారం చెల్లించినట్టు వివరించారు. పరిహారం చెల్లించిన తర్వాతే స్వాధీనం చేపడతామని హామీ ఇచ్చారు. ఈ వాదనలు పరిశీలించిన జస్టిస్ ఎన్‌వి శ్రవణ్‌కుమార్ పరిహారం చెల్లించే వరకు భూముల నుంచి రైతులను పంపకూడదని తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు సమర్పించాలని ప్రభుత్వానికి సూచిస్తూ తదుపరి విచారణను జూన్ ఎనిమిదో తేదీకి వాయిదా వేశారు.
అప్పీల్‌పై 30లోగా నిర్ణయం తీసుకోండి : హైకోర్టు
రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల జాబితా నుంచి తొలగించిన విషయంపై దాఖలైన అప్పీల్‌ను ఈనెల 30లోగా పరిష్కరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆలిండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సహనాజ్ తబస్సుమ్ దాఖలు చేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్‌ల బెంచ్ సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ తమ పార్టీ పేరును జాబితా నుంచి తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అప్పీల్ ఇచ్చినప్పటికీ, దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. దీని వల్ల రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు తగ్గిపోతాయని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది స్పందిస్తూ ఎన్నికల్లో పోటీ చేయని అనేక పార్టీలను గుర్తించి జాబితా నుంచి తొలగించినట్టు వివరించారు. పిటిషనర్ అప్పీల్‌ను పరిశీలిస్తామని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం అప్పీల్‌పై ఈనెలాఖరులోగా తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ కేసును ముగించింది.
పీఎస్ ర్యాంకింగ్‌పై వివరణ ఇవ్వండి : హైకోర్టు
శామీర్‌పేట పోలీస్ స్టేషన్‌కు దేశవ్యాప్తంగా ఏడో స్థానం కేటాయింపుపై వివరణ ఇవ్వాలని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై లోకహిత సొసైటీ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఈవి వేణుగోపాల్ సోమవారం విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ ఆ పోలీస్ స్టేషన్ పనితీరు తగిన స్థాయిలో లేదనీ, దర్యాప్తుల్లో లోపాలు ఉన్నాయనీ, ఫిర్యాదుల స్వీకరణలోనూ నిర్లక్ష్యం ఉందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానం, దేశ స్థాయిలో ఏడో ర్యాంకు ఇవ్వడం సరైంది కాదని పేర్కొన్నారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి కేంద్ర హోంశాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, విజిలెన్స్ కమిషనర్ తదితరులకు నోటీసులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు సమర్పించాలని ఆదేశించారు. విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేశారు.
రైతులను ఖాళీ చేయించొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



