Sunday, March 15, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు'జనగణన-2027' పై అపోహలొద్దు

‘జనగణన-2027’ పై అపోహలొద్దు

- Advertisement -

ప్రజలందరూ స్వచ్ఛందంగా వివరాలు వెల్లడించాలి
సంక్షేమ పథకాలకు గణనతో సంబంధం లేదు
సమాచారం ఇవ్వని వారికి రూ.1,000 జరిమానా
తెలంగాణ సెన్సెస్‌ డైరెక్టర్‌ భారతీ హోలికేరి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
”జనగణన -2027” నిర్వహణపై అపొహలొద్దని తెలంగాణ సెన్సెస్‌ డైరెక్టర్‌ భారతీ హోలికేరి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని సెన్సెస్‌ కార్యాలయంలో ఆమె పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా జనాభా లెక్కల సేకరణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రెండు దశల్లో చేపట్టనున్న జనగణనలో పొరపాట్లకు ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. జనగణనకు సంక్షేమ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా వివరాలు వెల్లడించాలని కోరారు. 11 మే, 2026 నుంచి 9 జూన్‌ 2026 వరకు మొదటి విడత, 2027 ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 28 వరకు రెండో విడత నిర్వహిస్తామని చెప్పారు.

మొదటి విడతలో ఇండ్లు, ప్రభుత్వ, ప్రయివేట్‌ సంస్థల వివరాలు, రెండో దశలో జనాభాను లెక్కిస్తామన్నారు. ఇండ్లు లేనివారు, ఫుట్‌ఫాత్‌లపై నివసించే వారిని గుర్తించి 2027 ఫిబ్రవరి 28న వారి వివరాలు సేకరిస్తామన్నారు. రివిజనల్‌ రౌండ్‌ మార్చి 1 నుంచి మార్చి 5 వరకు సేకరిస్తామన్నారు. ఈ సారీ సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌కు 16 భాషల్లో అవకాశం కల్పించినట్టు తెలిపారు. మార్చి 26 నుంచి మే 10 వరకు పౌరులు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో జనగణనకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోడల్‌ అధికారిగా కమిటీని ఏర్పాటు చేశామన్నారు. జిల్లా స్థాయిలో చార్జ్‌ అధికారులుగా కలెక్టర్లు వ్యవహరిస్తారని తెలిపారు. ఆయా జిల్లాలకు సంబంధించి పూర్తి బాధ్యత వారిదేనన్నారు.

సెక్షన్‌ 15 ప్రకారం సమాచార గోప్యత ఉంటుందని చెప్పారు. సెన్సెస్‌లో ఇచ్చిన డాటాకోర్టులో ఎవిడెన్స్‌గా పనికి రాదన్నారు. సమాచారం ఇవ్వని వారికి రూ.వెయ్యి జరిమానా విధించనున్నట్టు ఆమె తెలిపారు. 800 జనాభాను ఒక బ్లాక్‌గా, రాష్ట్రంలో మొత్తం 76 వేల బ్లాక్‌లను గుర్తించా మన్నారు. ఇందుకు గాను 75 వేల ఎన్యూమరేటర్లను, 12 వేల మంది సూపర్‌ వైజర్లను నియమించామని చెప్పారు. వీరందరికీ వివిధ దశల్లో శిక్షణ అందించామని వివరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని రామచంద్రాపురం 12వ వార్డు, నల్లగొండ జిల్లా తిప్పర్తి మండంలోని 5 గ్రామాలు, భద్రాది కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని 7 గ్రామాల్లో ఫ్రీ టెస్ట్‌ నిర్వహించామన్నారు. ఒక్కరూ మిస్‌ కాకూడదనీ, అలాగే రెండోసారీ నమోదు కాకూడదనే కాన్సెప్ట్‌తో జనగణనను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రజలు జనగణన-2027కు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

2027 జనగణన కీ పాయింట్స్‌
మొదటి విడత : మే 11 నుంచి 2026 జూన్‌ 9 వరకు (ఇండ్ల గణన)
రెండో విడత : ఫిబ్రవరి 9 నుంచి, 2027 ఫిబ్రవరి 28 వరకు( జనాభా సేకరణ)
సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌ : 2026 ఏప్రిల్‌ 26 నుంచి మే 10 వరకు అవకాశం
సేకరణ : డిజిటల్‌ విధానం ద్వారా నమోదు
ఇండ్లు లేని వారి వివరాలు : 2027 ఫిబ్రవరి 28న సేకరిస్తారు
ప్రశ్నలు : 33 (పేరు, వృత్తి, ఆస్తులు తదితర వివరాలు సేకరిస్తారు)
జిల్లాల సెన్సెస్‌ హ్యాండ్‌ బుక్‌ : (వనరులపై సమాచారాన్ని సేకరిస్తారు)
పట్టణాలు : 420 రకాల డేటా
గ్రామాలు : 400 రకాల వివరాలు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -