టోల్ ఫ్రీ నెంబర్ 1916పై అవగాహన పెంచండి
గ్రామస్థాయిలో సర్పంచుల అభిప్రాయమే మార్గదర్శకం
వారి ఫీడ్‌బ్యాక్‌కు అధిక ప్రాధాన్యమివ్వండి : మిషన్ భగీరథ అధికారులను ఆదేశించిన మంత్రి డాక్టర్ సీతక్క
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా తాగునీటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ(సీతక్క) ఆదేశించారు. తాగునీటి సమస్యపై టోల్ ఫ్రీ నెంబర్ 1916ను సంప్రదించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. తాగునీటి సరఫరా, నీటి నాణ్యత, ఓవర్ హెడ్ ట్యాంకుల క్లోరినేషన్, ట్యాంకుల శుభ్రత, పైపులైన్ లీకేజీలు, పంపుల పనితీరు, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు, టోల్ ఫ్రీ నెంబర్ 1916పై అవగాహన తదితర 16 కీలక అంశాలపై మిషన్ భగీరథ అధికారులు వివరాలు సేకరించారు.
దానిపై మంత్రి సీతక్క శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్పంచులతోనూ నేరుగా మాట్లాడారు. అభిప్రాయ సేకరణలో అధిక శాతం సర్పంచులు తాగునీటి సరఫరాపై సంతృప్తి వ్యక్తం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మొత్తం 12,728 గ్రామ పంచాయతీలకుగానూ 12,457 మంది సర్పంచుల నుంచి అభిప్రాయాలు సేకరించామని మంత్రికి అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ… సర్పంచులు గుర్తించిన తాగు నీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామస్థా యిలో సర్పంచుల అభిప్రాయమే ప్రభుత్వానికి అసలైన మార్గదర్శకమనీ, వారి సూచనల ఆధారంగా మిషన్ భగీరథ సేవలను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు.
మిషన్ భగీరథ వ్యవస్థ లేని మారుమూల గ్రామాల్లో ప్రజల అవసరాల మేరకు ఓపెన్ వెల్స్ తవ్వించాలనీ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల్లో భాగంగా వర్షాకాలానికి ముందే చెక్‌డ్యాంలు నిర్మించాలని అధికారులకు సూచించారు. స్థానిక నీటి వనరులను బలోపేతం ద్వారా దీర్ఘకాలికంగా నీటి లభ్యత పెరుగుతుందని చెప్పారు. తాగునీటి సమస్యలపై ఎవరైనా టోల్ ఫ్రీ నెంబర్ 1916కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సమస్యాత్మక గ్రామాలు, అటవీ ప్రాంతాలు, ఆదివాసీ గూడాలు, లంబాడీ తండాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వార్తా పత్రికలు, సోషల్ మీడియాలో తాగునీటి సరఫరాపై వచ్చే ప్రతి సమాచారం పట్ల వెంటనే అప్రమత్తమై సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.



