పియ్రమైన వేణు గీతికకు
నాన్న ఎలా ఉన్నావు? వేడి బాగా పెరిగిపోతోంది. వాతావరణం మారుతున్నప్పుడే ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. సరే! కిందటి ఉత్తరంలో పెళ్లి గురించి రాసాను. ఈ ఉత్తరంలో పిల్లల పెంపకంలో జాగ్రత్తలు చెప్తాను. పెళ్లి అయ్యాక కుటుంబం వృద్ధి చెందక మానదు. ముఖ్యంగా సంతానం. పసిపిల్లల విషయంలో అత్యంత శ్రద్ధ వహించాలి. ఆరు నెలల వరకు ప్రసూతి సెలవు అనేది ఉంటుంది. ఆ తర్వాత పిల్లలను ఎలా చూసుకోవాలి అనే ఆందోళన మొదలవుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, పసి పిల్లలను చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టుకుని, పెద్దవాళ్లను పర్యవేక్షిస్తూ ఉండమని చెప్పాలి.
ఒకవేళ అలా కుదరని పక్షంలో మీరు పని చేసే చోట బేబీ కేర్ సెంటర్ ఉంటే అందులో చేర్పించి, మధ్య మధ్యలో వెళ్లి చూసి రావాలి. వాళ్ళు ఏవిధంగా పిల్లలను చుసుకుంటారో తెలిసిన వాళ్ళ దగ్గర ముందుగా వాకబు చేసుకోవాలి. అలా కూడా కుదరని పక్షంలో ఇంటికి దగ్గరగా కానీ, ఆఫీస్‌కి దగ్గరగా కానీ బేబీ కేర్ సెంటర్ ఉంటే ముందు వివరాలు తెలుసుకుని, స్వయంగా ఒకటికి, రెండు సార్లు వెళ్లి చూసి, వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టించినట్లు అయితే ఆ కనెక్షన్ మీ మొబైల్‌లో ఉండేలా చూసుకోవాలి. దీని వలన పిల్లలను వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు, సమయానికి ఆహారం పెడుతున్నారా లేదా ఇవన్నీ మొబైల్‌లో చూసుకోవచ్చు. ఒకవేళ అది కూడా నచ్చలేదంటే తల్లిగా నీ బాధ్యత, ఉద్యోగం రెండు నిర్వర్తించాలనుకుంటే వర్క్ ఫ్రం హోమ్ చేస్తూ, పిల్లలను చూసుకునేందుకు ఒక మనిషిని పెట్టుకొవాలి.
అప్పుడు పిల్లలు నీకళ్ల ముందే ఉంటారు. నువ్వూ ఉద్యోగం చేసుకోవచ్చు. గుర్తుంచుకోవల్సిన విషయం ఏమిటంటే ఇతరులను నమ్మి వారి వద్ద పిల్లలను వదిలెయ్యవద్దు. చుట్టుపక్కల వారి ఇళ్లల్లో కూడా వదిలి పెట్టవద్దు. తల్లిగా నీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని నా ఆకాంక్ష. పిల్లలను ఎప్పుడూ అలక్ష్యం చేయొద్దు నాన్న. నీ కోసం నేను చేస్తున్న ఉద్యోగం వదిలేసుకున్నాను. నీకంటే నాకు ఉద్యోగం ముఖ్యం కాదు అనిపించింది. అప్పుడు నేను ఉన్న పరిస్థితుల్లో నాకు ఉద్యోగం చాలా చాలా అవసరం. అయినా వదిలేసాను. నీవు కూడా నీ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటావని ఆశిస్తూ..
ప్రేమతో అమ్మ
పాలపర్తి సంధ్యారాణి



