ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ పిటిషన్‌పై నిందితులకు హైకోర్టు ఆదేశం
‘ట్రయల్ కోర్టు జడ్జీ’ పరిధి దాటారా? అంశంపై తేల్చే బాధ్యత తమపై ఉందని వ్యాఖ్య
తదుపరి విచారణ ఏప్రిల్ 2కు వాయిదా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రౌస్ ఎవెన్యూ కోర్టు (ట్రయల్ కోర్టు) స్పెషల్ జడ్జీ తన పరిధిని దాటారా? లేదా? అని తేల్చాల్సిన బాధ్యత తమపై ఉందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్‌లో దర్యాప్తు సంస్థల తీరును తప్పుబడుతూ ట్రయల్ కోర్టు చేసిన వ్యాఖ్యలను తొలగించాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై గురువారం జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈడీ తరఫున ఏఎస్జీ ఎస్వీ రాజు, ప్రత్యేక న్యాయవాది జోహెబ్ హుస్సేన్‌లు వాదనలు వినిపించారు. సీబీఐ కేసుతో ఈడీకి సంబంధం లేనప్పటికీ న్యాయమూర్తి తమపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరం తెలిపారు.
న్యాయమూర్తి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని అభ్యర్థించారు. ఈ విషయంలో సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జ్ ఈడీ దర్యాప్తుపై చేసిన వ్యాఖ్యలు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని వాదించారు. ”పీఎంఎల్‌ఏ కింద ఈడీ స్వతంత్రంగా చేపట్టిన దర్యాప్తునకు సంబంధించిన పేరాలను తొలగించాలి. ఎందుకంటే అవి ‘న్యాయ పరిధిని అతిక్రమించడం’ కిందకు వస్తాయి. ఈడీ వద్ద ఉన్న సాక్ష్యాధారాలను పరిశీలించకుండానే, కనీసం తమ వాదనలు వినే అవకాశం కూడా ఇవ్వకుండానే ప్రత్యేక కోర్టు జడ్జీ ఆ వ్యాఖ్యలు ఎలా చేస్తారు? కేవలం సీబీఐ కేసులో అభియోగాలు మోపడానికి తగిన ఆధారాలు ఉన్నాయా? లేదా? అన్నది మాత్రమే ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకోవాలి. ఎన్నికల ఫండింగ్ లాంటి అంశాలపై కోర్టు చేసిన వ్యాఖ్యలు ఈడీ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయి.
ఎలాంటి ఆధారాలు లేకుండా, కేవలం ఊహలతో దర్యాప్తు సంస్థలపై చేసిన ఇటువంటి ”స్వీపింగ్ రిమార్క్స్” వల్ల వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం దెబ్బతింటుంది’ అని ఈడీ ఆందోళన వ్యక్తం చేసింది. కాగా, పిటిషన్ పై స్పందించేందుకు తమకు సమయం కావాలని నిందితుల తరఫు న్యాయవాదులు కోరగా…జస్టిస్ స్వర్ణకాంత శర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా 600 పేజీల తీర్పు కాపీ పేరుతో వారం గడువు కోరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి అదే సాకుతో ఈడీ కేసులో సమయం కోరడం సరికాదని వ్యాఖ్యానించారు. అయితే ప్రతివాదుల అభ్యర్థన మేరకు మరింత సమయం ఇస్తూ కేజ్రీవాల్, కవిత సహా నిందితులందరికీ నోటీసులు జారీ చేసింది. మరోసారి గడువు కోరవద్దని పేర్కొంటూ తదుపరి విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేసింది.
600 పేజీల సాకుతో మళ్లీ గడువు కోరొద్దు
- Advertisement -
- Advertisement -



