Thursday, May 15, 2025
Homeరాష్ట్రీయంప్రాజెక్టుల నిర్మాణంలో రాజకీయ ఒత్తిళ్లకు లోనుకావ‌ద్దు

ప్రాజెక్టుల నిర్మాణంలో రాజకీయ ఒత్తిళ్లకు లోనుకావ‌ద్దు

- Advertisement -

– త్వరలో గ్రూప్స్‌ నోటిఫికేషన్లు
– కాళేశ్వరానికి రూ. లక్ష కోట్లు ఖర్చుపెట్టినా 50 వేల ఎకరాలకూ నీళ్లివ్వలే : సీఎం రేవంత్‌ విమర్శ
– నీటిపారుదల శాఖలో ఉద్యోగులకు నియామక పత్రాలందజేత
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

ప్రాజెక్టుల నిర్మాణంలో పరిమితమైన అవగాహనతో రాజకీయ నాయకులు చేసే ఒత్తిళ్లకు లొంగవద్దని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులు, ఇంజినీర్లను ఆదేశించారు. సాంకేతిక అంశాలు, ఆర్థిక విషయాలపై స్పష్టమైన విజ్ఞానంతో పనులు చేపట్టాలని సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని జలసౌధ ప్రాంగణంలో టీజీపీఎస్సీ ద్వారా నీటిపారుదల శాఖలో అసిస్టెంట్‌ ఇంజినీర్లు, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్లుగా ఎంపికైన అభ్యర్థులకు సీఎం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులతో జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులకు నెహ్రు శంకుస్థాపన చేశారనీ, నాగార్జునసాగర్‌, శ్రీశైలంతోనే మనకు నీళ్లు అందుతున్నాయని గుర్తు చేశారు. ” 50, 60 ఏండ్ల క్రితం నిర్మించిన ప్రాజెక్టుల నుంచే నేటికీ మనకు నీళ్లు వస్తున్నాయి. నాగార్జునసాగర్‌, శ్రీరామ్‌సాగర్‌ ఎన్నో వరదలు, ఉపద్రవాలు తట్టుకుని నిలబడ్డాయి. రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టిన కాళేశ్వరం మాత్రం మూడేండ్లల్లోనే కుప్పకూలింది. ఈ తరహా ప్రాజెక్టు ప్రపంచంలో మరెక్కడా లేదు. ఈ కాళేశ్వరంతో అదనంగా వెయ్యి ఎకరాలకు కూడా నీరందలేదు. కనీసం మట్టి పరీక్షలు కూడా చేయకుండా ప్రాజెక్టు నిర్మించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌ది’ అని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఎస్‌ఎల్‌బీసీ, సీతారామ, దేవాదుల, నెట్టెంపాడు, సమ్మక్క, సారక్క ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేస్తామన్నారు. గ్రూపు-1 నియామకాలు అడ్డుకోవడం వెనుక ఉన్న రాజకీయ నాయకులు ఎవరో ప్రజలకు తెలుసన్నారు. త్వరలోనే గ్రూప్స్‌ నియామకాలు పూర్తి చేస్తామని ప్రకటించారు. నీళ్ల కోసం పోరాటాలు, ఉద్యమాలతోనే తెలంగాణ వచ్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు, ప్రజలు తీవ్ర అవమానాలకు గురయ్యారని చెప్పారు. ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు కావనీ, భావోద్వేగంతో ముడి పడ్డాయని వ్యాఖ్యానించారు. కొత్త ఇంజినీర్లు తెలంగాణ పున:నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగమంటే నెలనెలా జీతం తీసుకోవడం కాదనీ, ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేయడమని అభిప్రాయపడ్డారు. గత పదేండ్లల్లో ప్రాజెక్టులను నిర్మించలేదన్నారు. రైతుల ఆత్మగౌరవం కోసమే తాము నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని చెప్పారు. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చురుగ్గా పని చేస్తున్నారని అభినందించారు. 738 మందికి నియామకపత్రాలు ఇచ్చినట్టు చెప్పారు. ముఖ్యమంత్రి కావాలంటే రెండూ మూడేండ్లు సరిపోతుందనీ, ఇంజినీర్‌ ఇన్‌ ఛీఫ్‌ కావాలంటే 30 ఏండ్లు పడుతుందని అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన టన్నెల్‌ అని చెప్పారు. అధికారులు, ఇంజినీర్లకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహాకారం ఉంటుందన్నారు. ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వివరించారు.
హైదరాబాద్‌ను విశ్వేశ్వరయ్య కాపాడారు: ఉత్తమ్‌
హైదరాబాద్‌ను వరదల నుంచి కాపాడిన చరిత్ర మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకే ఆయనకు భారత రత్న దక్కిందన్నారు. నిజాంసాగర్‌ నిర్మించారని గుర్తు చేశారు. గొప్ప ఇంజినీర్లు తయారుకావాలని కోరారు. కొత్త ఇంజినీర్లు ప్రజలకు అమోఘమైన సేవలు అందించాలని సూచించారు. భారీస్థాయిలో పోస్టులను భర్తీ చేస్తున్నట్టు వివరించారు. మొత్తం 12 వేల మంది నీటిపారుదల శాఖలో పనిచేస్తున్నారని తెలిపారు.
నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని చెప్పారు. అనంతరం అభ్యర్థులందరికీ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్‌ అధ్యక్షత వహించగా, ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, విప్‌ జగ్గారెడ్డి, ప్లానింగ్‌ కమిషన్‌ వైస్‌చైర్మెన్‌ చిన్నారెడ్డి, సలహాదారు ఆధిత్యనాద్‌ దాస్‌, ముఖ్యకార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానీయా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఈఎన్సీ జనరల్‌ జి అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -