ఎస్‌ఐఆర్‌పై కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
స్థానిక ఎన్నికలు పూర్తయ్యేవరకూ వాయిదా వేయాల్సిందే
తిరువనంతపురం : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ద్వారా ప్రజల ప్రాథమిక హక్కులను హరించే చర్యలను ఎన్నికల సంఘం మానుకోవాలని, ఓటర్ల జాబితాను నిష్పక్షపా తంగా, పారదర్శకంగా నవీకరిం చాలని కేరళ అసెంబ్లీ ఏకగ్రీవం గా డిమాండ్ చేసింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమ వారం ప్రవేశ పెట్టిన ఈ తీర్మానానికి పాలక ఎల్‌డీఎఫ్, ప్రతిపక్ష యూడీ ఎఫ్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఈసీఐ ఎస్‌ఐఆర్ చేపడుతున్న సమయం, 2002 జాబితాను ఆధారంగా వినియోగించాలనే నిర్ణయం, ఓటర్ల కోసం నిర్దేశించిన అర్హత షరతులపై అసెంబ్లీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మైనా రిటీ కమ్యూనిటీలు, మహిళలు, పేద కుటుంబాలు, ఎస్‌సీ, ఎస్‌టీ తెగలు, విదేశీ ఓటర్ల హక్కును ఎస్‌ఐఆర్ నిరాకరిం చవచ్చు నని తీర్మానంలో పేర్కొం ది. కేరళలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగను న్నాయని, 2026లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, ఈ సమయం లో ఎస్‌ఐఆర్ చేపట్టాలనే ఈసీఐ ఎత్తుగడ దురుద్దే శంతో కూడుకున్నదని విమర్శించింది. 2002లో రాష్ట్రంలో చివరి సారిగా ఎస్‌ఐఆర్ నిర్వహించి నప్పుడు రూపొం దించిన ఓటర్ల జాబితాలను ప్రస్తుత ఎస్‌ఐఆర్‌కు ఆధార పత్రంగా వినియోగించాలనే ప్రణాళిక అశాస్త్రీయమైనదని పేర్కొంది.
ఎస్‌ఐఆర్‌కు లోబడి ఎలక్టోరల్ రోల్స్ తయారీ ఎన్‌ఆర్‌సి అమలుకు పరోక్ష మార్గం ఎలక్టోరల్ రోల్స్‌ను ఎస్‌ఐఆర్‌కి లోబడి చేయాలనే ఇసిఐ నిర్ణయం జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ)ను అమలు చేయడానికి పరోక్ష మార్గంగా పేర్కొంటూ తీర్మానంలో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్య ఓటర్ల బహిష్కరణ రాజకీయాలుగా అభివర్ణించింది. బీహార్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ఇటువంటి ఆందోళనలను ధ్రువీకరించింది. ఎస్‌ఐఆర్ రాజ్యాంగ చెల్లుబాటు సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నప్పటికీ .. ఎన్నికలు సమీపిస్తున్న కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో ఎస్‌ఐఆర్ అమలు చేయడంలో చూపిన తొందరపాటును అమాయకపు చర్యగా గుర్తించలేమని పేర్కొంది. పౌరసత్వ సవరణ చట్టాన్ని పునరుద్ధరింపచేసేందుకు వినియోగించే సెక్షన్లను ఎస్‌ఐఆర్‌లో వినియోగిస్తున్నారని, పౌరసత్వాన్ని మత ఆధారితంగా చేయడానికి ప్రయత్నించడం ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాలు అని తీర్మానం తెలిపింది.
1987 తర్వాత జన్మించిన వ్యక్తులు వారి తల్లిదండ్రుల్లో ఎరికైనా పౌరసత్వానికి సంబంధించిన ఆధారాలను సమర్పించాలనే షరతు వయోజన ఓటు హక్కును విస్మరిస్తుంది. 2003 తర్వాత జన్మించిన వ్యక్తులు ఇద్దరు తల్లిదండ్రుల పౌరసత్వ ఆధారాలను సమర్పించాలి. రికార్డులను రూపొందించలేకపోయారనే కారణంతో జాబితా నుంచి వ్యక్తులను మినహాయించడం రాజ్యాంగం హామీ ఇచ్చిన వయోజన ఓటు హక్కును తిరస్కరించడమేనని తీర్మానంలో పేర్కొంది.త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న నేపథ్యంలో.. అవి పూర్తయ్యేంత వరకు ఎస్‌ఐఆర్‌ను వాయిదా వేయాలని ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ డిమాండ్ చేశాయి. సెప్టెంబర్ 20న తిరువనంతపురంలో సీఈఓ రతన్ యు. కేల్కర్ ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి సమావేశంలో వారి అభ్యంతరాలను అధికారికంగా తెలియజేసిన సంగతి తెలిసిందే. ఎస్‌ఐఆర్ కోసం తాజా జాబితాలను వినియోగించాలని, గుర్తింపు పత్రాల జాబితాలో రేషన్ కార్డును కూడా చేర్చాలని రాజకీయపార్టీలు ఈసీఐని కోరాయి.