Sunday, December 28, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఅసెంబ్లీని రచ్చబండగా మార్చొద్దు

అసెంబ్లీని రచ్చబండగా మార్చొద్దు

- Advertisement -

సభలో నిర్మాణాత్మక చర్చలు జరపాలి : మాజీ ఎమ్మెల్యే జూలకంటి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఈనెల 29 నుంచి ప్రారంభమయ్యే శాసనసభను రచ్చబండగా మార్చొద్దని మాజీ శాసన సభ్యులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ శీతాకాల సమావేశాల్లో పాలకపక్షం, ప్రతిపక్షం తమ రాజకీయ విమర్శలు, వ్యక్తిగత దూషణలు, బూతులకు దిగి అసెంబ్లీ సమయాన్ని వృధా చేయొద్దని హితవు పలికారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ముఖ్యంగా రైతులు, కార్మికులు, నిరుద్యోగులు, వెనుకబడిన వర్గాల ప్రజల సమస్యలపై చర్చ జరపాలని కోరారు.

ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన ఆరు గ్యారంటీలు, పెండింగ్‌లో ఉన్న రైతు రుణ మాఫీ, నిరుద్యోగం, కృష్ణా-గోదావరి జలాల్లో రాష్ట్ర వాటా, పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు వంటి కీలక అంశాలపై అర్థవంతమైన చర్చ జరపాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్‌ కోడ్‌లు తెచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తున్నదని తెలిపారు. గ్రామీణ పేదల జీవనాధారమైన జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని, పథకంగా మార్చి దాని స్ఫూర్తిని దెబ్బతీసిందని విమర్శించారు. నిధులకు కోత పెట్టి, పనిదినాలు తగ్గించేందుకు కుట్ర చేస్తున్నదని చెప్పారు. ఈ అంశాలపై శాసనసభలో చర్చించి, కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు.శాసనసభ నడిచే ప్రతి నిముషానికి రూ. లక్షలు ఖర్చు అవుతున్నాయనీ, దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజాధనాన్ని వృధా చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -