పైసల్లేక ఇండ్లు కట్టుకోలేని లబ్దిదారులు
పనులు ప్రారంభించని ఇందిరమ్మ ఇండ్లు రద్దు !
లబ్దిదారులకు అందని ఇందిరా మహిళా శక్తి రుణాలు
రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మంది ఇండ్లు రద్దు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
పేదలకు సొంతిళ్ళు కలగానే మిగిలిపోతుంది. స్వతహగా ఆర్థిక స్థోమతలేని…అప్పు పుట్టని పేదలు నిర్ణీత గడువులోపు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించలేకపోయారు. ఆర్థిక పరిస్థితి బాగలేని పేద లబ్దిదారులకు ఇంటి నిర్మాణం కోసం ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా రుణాలిస్తామని చెప్పిన ప్రభుత్వం చేతులె త్తేసింది. రుణాలు అందకపోవడం, పైసల్లే కపోవడం వలన చాలా మంది పేదలు ఇంటిని కట్టుకోలే కపోయారు. అలాంటి వాళ్లందరి పేర్లను ఇందిరమ్మ లబ్దిదారుల జాబితా నుంచి రద్దు చేయడంతో కొత్త ఇల్లు కట్టుకోలేక… ఉన్న పాక కూల్చుకున్న పేద కుటుంబాలు వీధిన పడ్డాయి. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటే ఇంటి నిర్మాణం చేసుకోవాలని అనుకున్న పేదల ఆశలు అడియాశలయ్యాయి. ఆగస్టు 31 వరకు ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించలేదనన నెపంతో లబ్దిదారుల మంజూరు పత్రాలను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా 20 వేలు, నల్లగొండ జిల్లాలో 2000 ఇందిరమ్మ ఇండ్లను రద్దు చేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు.
నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 19697 ఇండ్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 31 వరకు నిర్మాణ పనులు ప్రారంభించని లబ్దిదారుల పేర్లు, అర్హత లేకున్నా నిర్మాణం చేపట్టిన వారి జాబితాలను సిద్ధం చేసి తొలగించినట్టు గృహ నిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రోజుకొక నిబంధన పెడుతోందని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆగస్టు 31 నాటికి ఇంటి నిర్మాణం ప్రారంభించకపోతే.. అలాంటి లబ్దిదారుల పేర్లను తొలగిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారులు కూడా క్షేత్రస్థాయిలో మార్గదర్శకాలను పట్టించుకోకుండా లబ్దిదారులను ఇబ్బంది పెడుతున్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నియమాల ప్రకారం.. నిర్మాణ వైశాల్యం (బిల్టప్ ఏరియా) గరిష్టంగా 650 చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) ఉండాలి. అంతకన్నా తక్కువ లేదా ఎక్కువ వైశాల్యంలో ఇంటి నిర్మాణం చేపడితే.. అలాంటి వారికి నిధులు మంజూరు చేసేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
రద్దుకు కారణాలు ఇవే..
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి డబ్బే పెద్ద సమస్య. నిరుపేద లబ్దిదారులు స్వతహగా ఇంటిని కట్టుకునేందుకు లక్షన్నర వరకు ముందే ఖర్చు చేయలేకపోతున్నారు. బేస్‌మెంట్ లెవల్ వరకు ఇంటి నిర్మాణ పనులు చేయాలంటే కనీసం రూ.1.50 నుంచి రూ.2 లక్షలు ఖర్చవుతుంది. అంత మొత్తంలో డబ్బుల్లేని పేదలు ఇంటి నిర్మాణం జోలికెళ్లలేదు. అలాంటి పేదలకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు రుణాలిస్తామని ప్రభుత్వం చెప్పింది. దాంతో కొంత వెసులుబాటు కల్గుతుందని లబ్దిదారులు ఆశించారు. అయితే స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన వాళ్లకు మాత్రమే రుణాలివ్వాలనే నిబంధన ఉండడంతో చాలా మంది పేద లబ్దిదారులకు రుణాలందలేదు. అప్పు చేసి ఇంటి నిర్మాణం ప్రారంభిస్తే వెనువెంటనే బిల్లులు వస్తాయన్న నమ్మకంలేకపోవడంతో చాలా మంది ఆసక్తి చూపలేదు. ఊర్లో కొందరు లబ్దిదారులు అప్పులు చేసి ఇంటి పనులు చేపట్టినప్పటికీ బిల్లులు చేతికందక చతికల పడ్డారు. దీంతో అసలే పైసల్లేని పేదలుకావడంతో ఆగస్టు 31 వరకు ఇంటి నిర్మాణం మొదలు పెట్టాలని అధికారులు నిర్ణయించిన గడువులోపు పనుల్ని ప్రారంభించలేకపోయారు.
మరో పక్క బిల్లుల చెల్లింపులో జాప్యం, ఊర్లో ఇసుక కొరత, మేటీరియల్ సరఫరా సమస్యలు, నిబంధనల ప్రకారం ఇండ్ల పనులు మొదలు పెట్టకపోవడం, నిర్మాణ వ్యయం పెరగడం, అర్హత లేకపోయినా కేటాయింపులు చేయడం, అధికారులు అవగాహన కల్పించకపోవడం తదితర సమస్యలను లబ్దిదారులు ఎదుర్కొంటున్నారు. పనులు ప్రారంభమయ్యాకే బిల్లులు రావడం.. అదీ ఆలస్యమవుతుండటంతో ఆర్థిక పరిస్థితి బాలేని వారు ఇండ్ల నిర్మాణం చేపట్టలేకపోయారు. దశలవారీగా రావాల్సిన ఆర్థిక సహాయం అందకపోవడం వంటివి లబ్దిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నిర్మాణం పూర్తయినా, బిల్లులు మంజూరు కావడం లేదు. నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 19697 ఇండ్లను కేటాయించారు. వాటిల్లో 18673 ఇండ్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు అందులో 9133 ఇండ్ల నిర్మాణం ప్రారంభించారు. బేస్మెంట్ లెవెల్‌లో 7555, లెంటల్ లెవెల్ 1246, రూప్ సెంట్రింగ్ లెవల్ 329, పూర్తి అయినవి. నిర్మాణం పూర్తయినవి కేవలం మూడు ఇండ్లు మాత్రమే. ఇంకా 4218 ఇండ్ల నిర్మాణం పనులు ప్రారంభించాల్సి ఉంది.
ఇల్లు కట్టుకునే స్థోమత లేదు.. కప్పలబావి కవిత, లక్ష్మీపురం, నార్కట్‌పల్లి
ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలం ఉంది. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి పత్రం ఇచ్చారు. ఇంటి నిర్మాణం మొదలుపెట్టడానికి డబ్బులు లేవు. హోటల్‌లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్న. పునాది నిర్మాణం చేసే స్థోమత లేక మూడు నెలల నుంచి పనులు ప్రారంభించలేదు. ప్రభుత్వం ముందస్తుగా ఆర్థిక సహాయం చేస్తే పనులు ప్రారంభించుకుంటాం.
నిబంధనలు మార్చాలి.. సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నియమ నిబంధనలను మార్చాలి. లబ్దిదారులకు ముందస్తుగా లక్ష రూపాయలు మంజూరు చేసి ఇంటి నిర్మాణం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. రాజకీయ కోణంలో కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించుకునే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలి. జిల్లాలో 2వేల మంది ఇండ్లను రద్దు చేయడం అన్యాయం..
రెండు వేల మంది లబ్దిదారులను తొలగించాం.. నల్లగొండ హౌసింగ్ పీడీ రాజ్ కుమార్
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నిబంధనలు పాటించని, సకాలంలో పనులు ప్రారంభించని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వారిని తొలగించాం. జిల్లాలో రెండు వేల మంది లబ్దిదారుల నుంచి లిఖితపూర్వకంగా వాంగ్మూలం తీసుకున్నాం. నిబంధన మేరకు తొలగించాం.